ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నష్ట వివరాలు సేకరించాలని అధికారులకు కలెక్టర్​ ఆదేశం - collect meet on crop lost news

నివర్ తుపాను కారణంగా చిత్తూరు జిల్లాలో జరిగిన నష్టానికి సంబంధించి వివరాలు సేకరించాలని అధికారులను కలెక్టర్​ ఆదేశించారు. చంద్రగిరి నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాల్లో తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు​ పర్యటించారు. రైతులకు ప్రభుత్వం సాయం చేయాలని కోరారు.

collector meet
చిత్తూరులో పరిస్థితిపై కలెక్టర్​ సమీక్ష

By

Published : Nov 28, 2020, 11:43 AM IST

చిత్తూరు జిల్లాలో వర్షాల వల్ల కలిగిన నష్టాల వివరాలు సేకరించాలని ఆయా శాఖల అధికారులను కలెక్టర్‌ ఎన్‌.భరత్‌గుప్తా ఆదేశించారు. జిల్లాలో చేపట్టాల్సిన సహాయక చర్యలపై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పంట నష్టం అంచనా వేయడానికి పది బృందాలను ఏర్పాటు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. పశువులు, కోళ్లు చనిపోవటంపై నివేదిక రూపొందించాలని సూచించారు.

తాగునీటి సరఫరాకు ఏర్పడిన అంతరాయాలు, దెబ్బతిన్న పైపులైన్ల వివరాలు ఇవ్వాలన్నారు. జలవనరుల శాఖ పరిధిలో ప్రాథమికంగా 42 చిన్నతరహా చెరువులకు నష్టం వాటిల్లినట్లు అధికారులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. జిల్లావ్యాప్తంగా 523 కిలోమీటర్ల మేర రహదారులు పాడైపోగా...32 కల్వర్టులు దెబ్బతిన్నాయని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

పీలేరు పట్టణ సమీపంలోని గార్గేయ నదిలో వరదనీరు చేరుతోంది. నదికి ఎగువన ఉన్న చెరువుల కట్టలు తెగిపోవటంతో ప్రవాహం మరింత పెరిగింది. పుంగనూరు, పీలేరు రెండు నియోజకవర్గాల్లో ప్రవహించే ఈ నది నాలుగేళ్ల తర్వాత ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నదీ పరివాహక ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు.

చంద్రగిరి నియోజకవర్గంలోని పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో తెదేపా పార్లమెంటరీ అధ్యక్షుడు పులివర్తి నాని పర్యటించారు. మండలంలోని మామిడి మనగడ్డ, నడింపల్లి, నాగయ్యగారి పల్లి, మూలపల్లిలో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించారు. రెండు రోజులుగా వర్షాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రజలను అధికారులు పట్టించుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు. పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: వరదలోనే ప్రజలు... సహాయక చర్యలు నిలిపివేత

ABOUT THE AUTHOR

...view details