వ్యవసాయ అనుబంధ రంగాల లబ్ధి దారులకు బ్యాంకుల ద్వారా అందించే రుణాల గురించి కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలని చిత్తూరు జిల్లా పాలనాధికారి ఎన్.భరత్‌గుప్తా అధికారులను ఆదేశించారు. తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి బ్యాంకర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక 20 వేల కోట్లు నిర్ణయించగా.. ఆరు నెలల కాలంలో 9,969 కోట్ల రూపాయలు రుణాలు అందచేశామని కలెక్టర్ వివరించారు.
వ్యవసాయ రంగంలో 12,430 కోట్లు రుణాలు ఇవ్వాల్సి ఉండగా 5,605 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు జిల్లా పాలనాధికారి తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి 2,909 కోట్ల రూపాయలు లక్ష్యం కాగా 1490 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాల అభివృద్ధికి తగినన్ని రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను కోరారు.