చిత్తురు జిల్లాలో కొవిడ్-19 చికిత్సకు ఎలాంటి ఇబ్బందులు లేవని, ఇప్పటికే ప్రత్యేకంగా ఆస్పత్రుల్లో వసతులు కల్పించడంతో పాటు రైలు బోగీలను సైతం వాడుకుంటామని జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ను సందర్శించి.. బోగీల్లో తయారు చేసిన 60 ఐసోలేషన్ వార్డులను పరిశీలించారు. వివరాలను స్టేషన్ డైరెక్టర్ నాగరమణశర్మను అడిగి తెలుసుకున్నారు. బోగీల్లోని క్వారంటైన్, ఐసోలేషన్ వార్డులను అత్యవసర పరిస్థితుల్లో ఉయోగిస్తామని కలెక్టర్ చెప్పారు. నాగరమణశర్మ మాట్లాడుతూ ప్రతి బోగీలో 9 మందికి చికిత్స అందించవచ్చని, నర్సులు, వైద్య సిబ్బందికి ప్రత్యేకంగా వేరే బోగీల్లో వసతి ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌కు వివరించారు.
నమూనాల సేకరణ 100 శాతం
క్వారంటైన్‌లో ఉన్నవారి నుంచి నమూనాల సేకరణను 100 శాతం పూర్తి చేయాలని కలెక్టర్ భరత్‌గుప్తా ఆదేశించారు. మంగళవారం చిత్తూరు నుంచి అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో మాట్లాడుతూ.. నమూనాలసేకరణ వేగవంతం చేయాలని, పాజిటివ్ కేసులు వచ్చినవారితో కాంటాక్టు అయిన వారి ఆరోగ్య స్థితిపై వైద్యాధికారులు దృష్టి సారించాలని సూచించారు. కంటైన్మెంట్ జోన్లు, హాట్‌స్పాట్‌లలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో సేవలు అందిస్తోన్న వైద్యసిబ్బందికి ప్రజలు సహకరించేలా చైతన్యం తీసుకురావాలని కలెక్టర్ కోరారు.
మూడు జోన్లపై సిద్ధంగా ఉన్నాం
లాక్‌డౌన్ పొడిగించిన నేపథ్యంలో జిల్లాలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లపై కార్యాచరణ ప్రణాళికను ఈ నెల 20లోపు సిద్ధం చేయాలని సీఎం వైఎస్ జగన్ జిల్లా అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ఆయన మాట్లాడారు. ఎస్పీ సెంథిల్‌కుమార్ మాట్లాడుతూ.. బయటి ప్రాంతాలవారు జిల్లాలోకి ప్రవేశించకుండా పటిష్ఠ చర్యలు చేపట్టామని, అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజలు సమూహంగా చేరకుండా పోలీసు సిబ్బంది క్షేత్రస్థాయిలో కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. జడ్పీ సీఈవో కోదండరామిరెడ్డి, డాక్టర్ రమాదేవి పాల్గొన్నారు.
ఇక్కడ భద్రంగా ఉండండి