తిరుగిరులు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవ శోభతో పులకించిపోతున్నాయి. దేవదేవుడి బ్రహోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేసిన వేదపండితులు మీన లగ్న శుభముహూర్తాన ఈ సాయంత్రం 5గంటల 23 నిమిషాలకు ధ్వజారోహణం నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సీఎం హాదాలో తొలిసారి పట్టువస్త్రాలు సమర్పించనున్న జగన్... 8 గంటలకు ప్రారంభమయ్యే పెద్దశేష వాహన సేవలో పాల్గొని రాత్రికి తిరుమలలోనే బస చేయనున్నారు.
7పడగల శేషుడిపై శ్రీదేవి భూదేవీ సమేతుడైన మలయప్పస్వామి కొలువుదీరి మాడవీధుల్లో... భక్తులకు అభయప్రదానం చేయనున్నారు. బ్రహ్మోత్సవాలతోపాటు సీఎం జగన్ రాక దృష్ట్యా తిరుమలలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. 3వేల 200 మంది పోలీసులను మోహరించారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల రవాణా సౌకర్యార్థం తిరుమల ఘాట్‌రోడ్డులో 24 గంటలూ వాహనాలను అనుమతిస్తున్నారు.