CM Jagan Cheating Tenant Farmers : కౌలు రైతు వెన్ను విరిగినా ముఖ్యమంత్రి జగన్ భరోసా ఇవ్వలేదు. మిగ్‌జాం తుపాను (Michaung Cyclone) నిండా ముంచినా కనికరం చూపలేదు. ఈ విపత్తు వల్ల దెబ్బతిన్న రైతుల్లో అధికశాతం కౌలురైతులే. గింజ రాక మొక్క బతక్కపెట్టుబడి పూర్తిగా పోయింది. డ్రెయిన్లు, కాలువలకు మరమ్మతులు కూడా చేయని పాపం ఫలితమే రైతుపాలిట శాపమైంది.
Tenant Farmers Crop Loss With Michaung Cyclone :‘ధాన్యం ఇక చేతికొచ్చేసినట్లే, కోసిన నాలుగు రోజుల్లో సొమ్ము అందుతుంది. అప్పులు తీరతాయి. పిల్లల చదువులకూ ఇబ్బంది ఉండదు’అనే సంతోషంలో ఉన్న అన్నదాతలపై మిగ్‌జాం తుపాను విరుచుకుపడింది. కూలీ చేసుకుంటూనే అప్పు తెచ్చి, పెట్టుబడి పెట్టి సాగు చేసిన కౌలు రైతుల కలల్ని తుంచేసింది. ఒక్కో కౌలు రైతు ఎకరాకు 35 వేల నుంచి 40 వేల రూపాయల పెట్టుబడితో వరి వేస్తే అది కాస్తా వర్షార్పణమైంది. చాలాచోట్ల గింజ కూడా చేతికి వచ్చే పరిస్థితి లేదు. ఇంతటి ఆపత్కాలంలోనూ కోతల అనంతర నష్టానికి పెట్టుబడి సాయం ఇవ్వలేమంటూ సర్కారు మొండిచేయి చూపిస్తోంది. మిరప రైతులైతే కోలుకోలేని విధంగా కుంగిపోయారు. ఉదారంగా ఆదుకోవాలని సమీక్ష సమావేశాల్లో అస్తమానం వల్లె వేసే ముఖ్యమంత్రి జగన్‌కు వారి గోడు పట్టడం లేదు. సర్వస్వమూ కోల్పోయిన కౌలుదారులకు భరోసా ఇవ్వాలనే ఆలోచనే కొరవడింది. కౌలు రైతుల కోసం ఇదిగో ఈ చర్యలు తీసుకోండనే ఉత్తర్వులిచ్చిన దాఖలాలే లేవు.
తుపాను ప్రభావంతో నిండామునిగిన మినుము రైతులు- పట్టించుకోని ప్రభుత్వం, ఆర్బీకే అధికారులు
AP Farmers Problems with Cyclones :మిగ్‌జాం కారణంగా ప్రభుత్వ ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షల 78 వేల ఎకరాల్లో వరి పైరుకు నష్టం వాటిల్లింది. పనల మీదున్న, తడిసిన ధాన్యం కూడా కలిపితే మరో 10 లక్షల ఎకరాల వరకు పంటను రైతులు నష్టపోయి ఉంటారని అనధికారిక అంచనా. ఈ బాధితుల్లో 70 శాతం వరకు కౌలు రైతులే ఉంటారు. తీవ్ర తుపాను తర్వాత ఇప్పటి వరకు ఐదుగురు కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ చూసినా నష్టపోయిన వరి, నేలవాలిన అరటి, కుళ్లిపోతున్న మినుము, పసుపు తదితర దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఏ కౌలు రైతును కదిలించినా కన్నీరుబుకుతోంది.
Michaung Cyclone in AP :కృష్ణా డెల్టాలో మొన్నటి వరకు సాగు నీటికి ఇబ్బందులు ఎదురయ్యాయి. పొలాలను కాపాడుకోవడానికి డీజిల్ ఇంజిన్లను వాడాల్సి వచ్చింది. ఖరీఫ్‌లో నాట్లు వేసింది మొదలు రైతులు ఈ ఏడాది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరి భూములకు నీరందలేదు. కాలువల్లో అరకొరగా పారుతున్న నీటిని డీజిల్ ఇంజిన్ల ద్వారా తోడుతూ పంటలకు సరఫరా చేశారు. ఎంతో శ్రమించి వరి పండిస్తే అది కాస్తా తీవ్ర తుపాను పాలైంది. మిగ్‌జాంకారణంగా పొలాల్లో చేరిన నీటిని మళ్లీ డీజిల్ ఇంజిన్లతోనే తోడిపోయాల్సి వచ్చింది. ఎంత తోడినా నీరు ముందుకు కదల లేదు. డ్రైనేజీ, కాలువల వ్యవస్థ సరిగా ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదు. వాన కురిసిన తర్వాత ఒక్క రోజులోనే నీరు బయటకు వెళ్లిపోతే ఇంత నష్టం వచ్చేది కాదు. పసుపు, మిరప, మినుము, అరటి తదితర పంటలు వేసిన రైతులదీ ఇదే పరిస్థితి.