ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పిల్లలకు మేనమామగా ఉంటా - చిత్తూరులో అమ్మఒడి పథకం ప్రారంభం న్యూస్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన అమ్మఒడి పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. చిత్తూరులో పథకానికి శ్రీకారం చుట్టారు. అమ్మఒడి ద్వారా 82 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం కలుగుతుందని... రాష్ట్రంలో విద్యాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టంచేశారు.

cm jagan ammavodi launching at chittor
cm jagan ammavodi launching at chittor

By

Published : Jan 10, 2020, 6:21 AM IST

Updated : Jan 10, 2020, 6:38 AM IST

పిల్లలకు మేనమామగా ఉంటా

పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు పడే బాధలను పాదయాత్రలో చూసి చలించి... వారి అభ్యున్నతి కోసమే అమ్మఒడి పథకం ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. చిత్తూరు పీవీకేఎన్​ ప్రభుత్వ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో... "పేమెంట్" ప్రాసెస్ మీట నొక్కి పథకానికి శ్రీకారం చుట్టారు. అక్కాచెల్లెమ్మలకు జగనన్నగా.. మీ పిల్లలకు మేనమామగా ఉంటానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

అమ్మఒడి ద్వారా 43 లక్షల మంది తల్లులు, 82 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూరుతుందని సీఎం తెలిపారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు 75 శాతం హాజరు తప్పనిసరి చేస్తామని ప్రకటించారు. అమ్మఒడి జాబితాలో పేరు నమోదుకు గడువును ఫిబ్రవరి 9వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు.

మధ్యాహ్న భోజన పథకం ఆహారపట్టికను మార్చుతున్నట్లు సీఎం ప్రకటించారు. అందుకోసం 200 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త మెనూ వివరాలను సీఎం చదివి వినిపించినప్పుడు... విద్యార్థులు కేరింతలు, చప్పట్లతో హర్షం వ్యక్తంచేశారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు... ప్రభుత్వం ఇస్తున్న 15 వేల నుంచి ప్రతి తల్లి వెయ్యి రూపాయలు ఇవ్వాలని సీఎం కోరారు.


ఆంగ్ల మాధ్యమంతో తొలినాళ్లలో విద్యార్థులకు తలెత్తే ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఉపాధ్యాయులనూ ఆమేరకు సన్నద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఇప్పటి స్కూలు పిల్లలు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసే నాటికి ఉండే పరిస్థితులను ఎదుర్కోనేందుకు అనుగుణంగా ఆంగ్ల మాధ్యమానికి ప్రాధాన్యమిస్తున్నట్లు స్పష్టంచేశారు.

రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు అమ్మఒడి పథకాన్ని ప్రారంభించారు.

ఇదీ చదవండి: 'ఆంగ్లమాధ్యమంలో ఇబ్బందులున్నాయ్.. తొలగించుకోవాలి'

Last Updated : Jan 10, 2020, 6:38 AM IST

ABOUT THE AUTHOR

...view details