విద్యలో నాణ్యతకు పెద్దపీట వేయాలంటే విశ్వవిద్యాలయాన్నింటినీ ఒకేతాటిపైకి తీసుకురావాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. క్షేత్రస్థాయిలో అందుకు తగిన కసరత్తు చేస్తోంది. ముందస్తుగా ఒకే తరహా ఫీజు విధానంపై ప్రత్యేక కమిటీతో అధ్యయనం చేయిస్తోంది. ఫీజులు, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై మూడు రోజుల్లో ఉన్నత విద్యామండలి అన్ని విశ్వవిద్యాలయాలకు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే శ్రీ వేంకటేశ్వర, పద్మావతీ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన పీజీ సెట్- 2020 ప్రవేశాల ప్రక్రియపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ప్రవేశాలు నిలిచిపోవటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
మూడురోజుల్లో స్పష్టత
ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని యోచన చేసిన ఎస్వీయూ పాలకులు ఉన్నత విద్యామండలి ఆదేశాలతో ఆ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. మరో మూడు రోజుల్లో ఉన్నత విద్యామండలి నుంచి ప్రవేశాల ప్రక్రియపై స్పష్టత వస్తుందని ఎస్వీయూ రెక్టార్ ఆచార్య సుందరవల్లి వెల్లడించారు. ఆ వెంటనే పీజీ సెట్ ప్రవేశాల ప్రక్రియను ప్రారంభిస్తామని, విద్యార్థులెవరు ఆందోళన చెందవద్దని తెలిపారు.
నాణ్యమైన విద్యకు శ్రీకారం
విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటుగా, ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం క్షేత్రస్థాయిలో కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం.. నేరుగా పరిశ్రమలతోనూ ఉపాధి కల్పన ఒప్పందాలను కుదుర్చుకోనుంది. ఈ అంశంలోనూ విశ్వవిద్యాలయాల మధ్య సమన్వయ లోపం లేకుండా చూడాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ క్రమంలోనే ఫీజులు, విద్యారంగ సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగావకాశాల కల్పన తదితర అంశాలపై పటిష్టమైన అకడమిక్ క్యాలెండర్‌తో 2020-21 విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని ప్రభుత్వ ఆలోచన. ఫలితంగానే పీజీసెట్ ప్రవేశాల ప్రక్రియ వాయిదా పడుతుందని అధికారులు తెలిపారు.
సాగి.. ఆగి..
శ్రీ పద్మావతీ మహిళా వర్సిటీలో 2020-21 విద్యా సంవత్సరానికి గాను పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 7న ప్రారంభమైన కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఈ ఏడాది మార్చిలో నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 1వ తేదీ ప్రవేశ పరీక్ష ఉంటుందని ప్రకటించారు. కరోనా కారణంగా మే నెలలో జరగాల్సిన ప్రవేశ పరీక్షను అక్టోబరులో నిర్వహించారు. అర్హత సాధించిన విద్యార్థినులకు ఈ నెల 7 నుంచి 17వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. 7న ప్రారంభమైన కౌన్సెలింగ్‌ను 11వ తేదీ వరకు నిర్వహించి పలు కోర్సుల్లో ప్రవేశాలు కల్పించారు. అయితే కౌన్సెలింగ్ ఫీజు ఒకే తరహాలో ఉండే విధంగా ఆదేశాలు వచ్చే వరకు కౌన్సెలింగ్‌ను నిర్వహించకూడదని ఉన్నత విద్యామండలి నుంచి వర్సిటీ ఉన్నతాధికారులకు ఆదేశాలు రావటంతో సోమవారం నుంచి జరగాల్సిన ప్రవేశాల ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
ఇదీ చదవండి
కర్నూలు: ఆర్టీసీ బస్సులో రూ. 1.9 కోట్లు స్వాధీనం