ప్రార్థనా స్థలాల్లో మత సామరస్యాన్ని బోధించాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా మత పెద్దలకు సూచించారు. జిల్లాలో మత సామరస్యం పెంపొందించటంలో భాగంగా అన్ని మతాల మత పెద్దలతో సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే..ఆ ప్రాతంలో మత పెద్దలు స్థానికులతో చర్చించి శాంతిని నెలకొల్పాలన్నారు. ఎవరైనా మతవిద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే నిలువరించాలన్నారు.
అవాంఛనీయ ఘటనలు జరిగితే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలన్నారు. ప్రతి ప్రార్థనా స్థలం వద్ద విజిలెన్స్ కమిటీ, పరిరక్షణ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఇప్పటివరకు మత ఘర్షణలు జరగలేదని ఆయన వెల్లడించారు.