చిత్తూరు జిల్లా కురబలకోటకు చెందిన బావాజీ అనే యువకుడు (24) పదేళ్ల వయస్సులోనే పేకాటకు బానిసయ్యాడు. అతని జీవితమే పేకాట అనేంత స్థాయికి వెళ్లాడు. పేకముక్కల్లో ఏ అంకె చెప్పినా.. కార్డును చూడకుండా తీసి ఇవ్వగలిగేంత ప్రావీణ్యం సంపాదించాడు. ఒక్కో పేక ముక్క అంకెను, అక్షరాన్ని చూడకుండానే చెప్పి అందర్నీ ఆశ్చర్యపరుస్తాడు. అలాంటి వ్యక్తిలో ఒక్కసారిగా మార్పు కనిపించింది. పేకాటపై విరక్తి కలిగింది. ప్రభుత్వం అనుమతి ఇస్తే తన శరీర అవయవాలను దానం చేయటానికి సిద్ధమని స్పందన కార్యక్రమంలో జిల్లా సబ్ కలెక్టర్కు విజ్ఞప్తి చేశాడు.
పేకాటలో ఇక మోసం చేయలేనని.. అందుకే పది మందికి ఉపయోగపడేలా అవయవాలను దానం చేసేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అతని విన్నపంపై స్పందించిన అధికారులు... బావాజీ తల్లిదండ్రులను పిలిపిస్తామన్నారు. వారితో కౌన్సిలింగ్ లో మాట్లాడుతామని, అతని మానసిక పరిస్థితిని పరిశీలిస్తామని చెప్పారు.