Chittoor Police Bribe: చిత్తూరులో నెలరోజుల క్రితం ఓ చోరీ కేసును ఛేదించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడు దొంగిలించిన బంగారాన్ని తమిళనాడు అరక్కోణంలో కుదువ పెట్టినట్లు విచారణలో తెలింది. అక్టోబరు 7న నగల రికవరీ కోసం సీఐ, ఎస్‌ఐ అరక్కోణం వెళ్లారు. బంగారం స్వాధీనం చేసుకుని, ముగ్గురు కుదవ వ్యాపారులను అదుపులోకి తీసుకుని చిత్తూరుకు తీసుకువచ్చారు. రెండు రోజుల్లో తన కుమారుడి నిశ్చితార్థం ఉందని ఓ వ్యాపారి ఎంత మొత్తుకున్నా పోలీసులు వినిపించుకోలేదు. స్టేషన్ నుంచి విడిపించాలంటే రూ.3 లక్షలివ్వాలని డిమాండ్ చేశారు. చిత్తూరులోని ఓ వ్యాపారి సహాయంతో లక్ష రూపాయలు ఇచ్చి అక్టోబరు 8న రాత్రి 11.30 గంటలకు బయటకు వచ్చారు. విషయం తెలుసుకున్న తమిళనాడు పాన్ బ్రోకర్స్ అండ్ జ్యుయెలర్స్ అసోసియేషన్ నాయకులు గత నెల 24న ఎస్పీ రిషాంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతంపై ఎస్పీ విచారణకు ఆదేశించారు.
చిత్తూరు పోలీసుల నిర్వాకం.. వదిలిపెట్టేందుకు ఎంత అడిగారంటే..! - police demanded bribe in chittoor
Bribe: ఏవరైనా నగలు తీసుకువచ్చి నగల వ్యాపారి దగ్గర కుదవ పెడితే.. ఇవి ఏక్కడివని వ్యాపారి అడగటం సహజమే. నగలు తీసుకు వచ్చిన వారు సొంత నగలయితే మావే అని ధైర్యంగా చెప్తారు. ఇంకా చేతివాటం చూపెట్టే చోరులయితే ఏవో చెప్పి కుదవ పెట్టడానికి చూస్తారు. వ్యాపారులు ఆరా తీస్తారు కానీ, ఇవి ఎక్కడివి అని పూర్తి శోధనయితే చేయలేరు కదా. ఇలానే ఓ దొంగ తీసుకువచ్చిన నగలను కుదవ పెట్టుకుని.. చిత్తూరు పోలీస్ స్టేషన్ మెట్లేక్కాడు తమిళనాడు వ్యాపారి. అయితే ఆ వ్యాపారి తన కుమారుడి నిశ్చితార్థం ఉందని చెప్పినా స్టేషన్ నుంచి పోలీసులు కదలినివ్వలేదు.
వైకాపా ప్రజాప్రతినిధి ఒకరు, చిత్తూరు జిల్లాకు చెందిన కీలక మంత్రి ఒకరు.. విచారణ వద్దంటూ ఎస్పీపై ఒత్తిళ్లు తెచ్చారు. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గకుండా ఏఎస్పీతో విచారణ చేయించగా అన్నీ వాస్తవాలేనని తేలింది. విషయం పెద్దది కావడంతో.. కేసును ఉపసంహరించుకోవాలంటూ వ్యాపారులపై సీఐ ఒత్తిడి తీసుకువచ్చారు. వారి నుంచి తీసుకున్న లక్ష రూపాయలను వెనక్కి ఇచ్చారు. ఫిర్యాదును వెనక్కు తీసుకుంటున్నట్లు వ్యాపారులు వినతిపత్రం ఇచ్చారు. ఈ వ్యవహారంపై ఎస్పీ రిషాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యాపారులు ఫిర్యాదు ఇచ్చింది వాస్తవమేనని, ఆ తర్వాత వారు ఉపసంహరించుకుంటూ అర్జీ ఇచ్చినప్పటికీ.. నిబంధనలు పాటించనందున సీఐ, ఎస్‌ఐలపై చర్యలకు సిఫార్సు చేశామని తెలిపారు.
ఇవీ చదవండి: