చిత్తూరు జిల్లా సత్యవేడు, నగరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో.. నివర్ తుపాను ప్రభావం అధికంగా ఉంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో జలాశయాలు పూర్తిగా నిండిపోయాయి. పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో.. గేట్లను ఎత్తి వరద నీటిని కిందకు వదిలేస్తున్నారు. అరణియార్, కాళంగి, మల్లెమడుగు జలాశయాల నుంచి వేల క్యూసెక్కుల వరద నీరు.. స్వర్ణముఖి నదికి చేరుతోంది. జిల్లాలో సగటున ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
చిత్తూరులో సన్నద్ధత:
నివర్ తుపానును ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సిద్దంగా ఉంచామని.. అనంతపురం రేంజి డీఐజీ కాంతిరాణా టాటా తెలిపారు. భారీ వర్షాలతో పూర్తి నీటిమట్టానికి చేరిన అరణియార్ జలాశయాన్ని ఆయన పరిశీలించారు. జలాశయం గేట్లు ఎత్తి నీటిని అరుణానదిలోకి వదలడంతో.. శ్రీకాళహస్తి- పిచ్చాటూరు మధ్య రాకపోకలు స్థంభించిపోయాయి. పోలీసు పహారా ఉంచి.. అటు వైపు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నట్లు డీఐజీ తెలిపారు.
తంబళ్లపల్లెలో తుపాను తీవ్రత:
తంబళ్లపల్లె నియోజకవర్గంలో నిన్న రాత్రి నుంచి తీవ్రమైన గాలులు, భారీ వర్షం.. జనజీవనాన్ని స్తంభింపజేశాయి. పెద్దేరు ప్రాజెక్టు పొంగుతుండటంతో.. వాగు దాటలేక రాకపోకలు స్తంభించాయి. తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల పరిధిలోని కోటాల, ఆర్యన్ తండా, జింజర్ పెంట, మందలవారి, బండమ్మ దిగువ పల్లె ప్రజలు జలదిగ్బంధంలో ఉండిపోయారు.
150 విద్యుత్ స్తంభాలు, 25 ట్రన్స్ఫార్మర్లు నేలకూలాయి. నియోజకవర్గంలో 80% అంధకారంలో ఉంది. 150 హెక్టార్లలో వరి నీటమునిగింది. వంద హెక్టార్లకు పైగా టమోటా, మొక్కజొన్న పంటలు దెబ్బలు తిన్నాయని వ్యవసాయ శాఖల ఏడీలు పేర్కొన్నారు. పూర్తిస్థాయి పరిశీలన అనంతరం.. పంట నష్టం ఇంకా ఎక్కువ ఉంటుందని అభిప్రాయపడ్డారు. కాకుమానుగుట్ట, దబ్బ గుట్ట, చిన్న ఏరు జలాశయాలు, నియోజకవర్గంలో 80శాతం చెరువులు, కుంటలు నిండి ప్రమాద స్థితిలో పొంగుతున్నాయి. హంద్రీనీవా కుప్పం, పీలేరు ప్రధాన కాలువలు చాలాచోట్ల తెగిపోయాయి.