తిరుపతి రూరల్ మండలం కరకంబాడీ రోడ్డు సమీపంలోని అడవుల నుంచి ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్న ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 24 ఎర్రచందనం దుంగలను, ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కేసీ వెంకటయ్య తెలిపారు.
ఎర్రచందనం అక్రమ రవాణాపై అందిన సమాచారంతో కరకంబాడీ రోడ్డు వద్ద తనిఖీలు నిర్వహించినట్లు డీఎస్పీ వెల్లడించారు. డీ మార్ట్ వెనుక వైపున ఎర్రచందనం దుంగలు వాహనంలోకి లోడ్ చేసి రవాణాకు సిద్ధంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎర్రచందనం కనిపించకుండా, సెంట్రింగ్కు ఉపయోగించే పరికరాలతో కప్పి పెట్టడంతో.. టాస్క్ ఫోర్స్ టీమ్ తనిఖీలు చేపట్టి చెన్నై రెడ్ హిల్స్ కు చెందిన సూర్య (23), ప్రదీప్ (20), తిరుపతి మంగళంకు చెందిన కిరణ్ (29) లను అదుపులోకి తీసుకున్నారు.