ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 29, 2020, 6:21 PM IST

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో చైనీస్ ఇంజినీర్ అరెస్ట్

చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం వికృతమాలలో చైనాకు చెందిన ఓ ఇంజినీర్​ను పోలీసులు అరెస్టు చేశారు. తను పని చేసే సంస్థకు పది కోట్ల రూపాయల మేర నష్టం కలిగించాడనే అభియోగంపై అతడిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Chittoor district police have arrested a Chinese engineer
Chittoor district police have arrested a Chinese engineer

వృత్తి ద్రోహానికి పాల్పడినందుకు చైనాకు చెందిన ఓ ఇంజినీర్​ను చిత్తూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని గురువారం మీడియా ముందుకు తీసుకువచ్చారు. కేసు వివరాలను రేణిగుంట డీఎస్పీ చంద్రశేఖర్ వెల్లడించారు. జిల్లాలోని ఏర్పేడు మండలం వికృతమాలలో ఫాక్స్ లింక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నిర్మాణ దశలో ఉంది. కేబుళ్ల తయారీ కోసం ఏర్పాటు చేసిన ఈ సంస్థలో ప్రస్తుతం భారీ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ పనుల కోసం చైనా నుంచి ఫాంగ్ చెంజిజ్ అనే ఇంజినీర్​ని రప్పించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా... ఈ నెల 21న ఏర్పేడు పోలీస్ స్టేషన్​లో సంస్థ నిర్వాహకులు ఆ చైనా ఇంజినీర్​పై ఫిర్యాదు చేశారు. భారీ యంత్రాలలోని అతి విలువైన కేబుళ్లను అతను కత్తిరించినట్లు తాము గుర్తించామన్నారు. దీనివల్ల పది కోట్ల రూపాయల మేర నష్టం వచ్చిందంటూ సంస్థ యాజమాన్యం ఇచ్చిన ఫిర్యాదుతో ఏర్పేడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు సాగించారు.

దర్యాప్తులో భాగంగా ఏర్పేడు పోలీసులు... ఇంజినీర్ ఫాంగ్ చెంజిజ్​ను తమదైన శైలిలో విచారించారు. ఉద్దేశపూర్వకంగానే యంత్రాలలోని విలువైన కేబుళ్లను కత్తిరించానని అతను విచారణలో ఒప్పుకున్నాడు. చైనాలో తనకు పరిచయం అయిన ఓ వ్యక్తి ప్రోద్బలం మీదటే ఈ నేరానికి పాల్పడినట్లు అంగీకరించాడు. దీని కోసం తనకు 5 లక్షల రూపాయలు ముట్టినట్లు పోలీసులకు వివరించాడు. నేరస్తుడు నుంచి వాంగ్మూలం తీసుకుని అరెస్టు చేశారు. మరోవైపు ఇతనికి డబ్బులు ఇచ్చి నేరం చేయించిన జొయింగ్ హుయి అనే వ్యక్తిని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details