తొలి దశ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అధికార పార్టీ నేతలు విపక్ష పార్టీ సర్పంచి అభ్యర్థులు, నేతలపై బెదిరింపులకు పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా వడమాలపేట మండలంలో అభ్యర్థి కిడ్నాప్ వ్యవహారం సంచలనం సృష్టించింది. మాంబేడులో అధికార పార్టీ నేతలు విపక్ష పోలింగ్ ఏజెంటుతోపాటు సర్పంచిగా పోటీ చేస్తున్న అభ్యర్థిపైనే చేయి చేసుకున్నారు. రామచంద్రాపురం మండలం కమ్మ కండ్రిగలో పోలింగ్ చీటీల వివాదం.. దొంగ ఓట్ల వ్యవహారం చోటు చేసుకుంది.
వడమాలపేట మండలం ఎల్‌ఎం కండ్రిగ పంచాయతీ పరిధిలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మునిరాజా తెదేపా మద్దతుదారుగా ఉన్నారు. 6వ తేదీ నుంచి అదృశ్యమయ్యాడు. అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారంటూ ఆయన మామ సోమవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మునిరాజాకు ఫోన్ చేయగా తాను ఎక్కడికీ వెళ్లలేదని ఉదయం వస్తానని చెప్పినట్లు పోలీసులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యాడు. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని ధర్మయ్యపై పోటీ చేయలేకనే తాను మానసికంగా కుంగిపోయి వెళ్లిపోయినట్లు చెబుతున్నాడు. అతని భార్య జ్యోతి మాత్రం తన భర్తను కిడ్నాప్ చేసి బెదిరించారని ఆరోపించారు.
*వెదురుకుప్పం మండలం మాంబేడులో వైపాకా మద్దతుదారులు తమపై దాడి చేశారని విపక్షాల మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులు కన్నీటి పర్యంతమయ్యారు. మాంబేడు పంచాయతీ పరిధిలోని 9, 10 వార్డుల్లో ఏజెంటుగా ఉన్న హేమశేఖర్‌ను చొక్కా పట్టుకుని బయటకు ఈడ్చుకు వచ్చారని వాపోయారు.
ఓట్లు వేసేందుకు లోపలికి వస్తున్న ఓటర్లను అక్కడే నిలిపివేసి బలవంతంగా ఓటు వేయిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై పీవోను అడుగుతున్న సమయంలోనే తనను పలుమార్లు మందలించారని హేమశేఖర్ పేర్కొన్నారు. ఇది అన్యాయమని తాను ప్రశ్నించినందుకు చొక్కా చించి బయటికి గెంటి వేశారని ఆరోపించారు.
అధికార పార్టీ నేతలు తనపై దాడి చేశారని సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రత్నమ్మ ఆరోపించారు. అక్కడే ఉన్న పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోలేదన్నారు. ఈ విషయాన్ని ఎస్పై దృష్టికి తీసుకెళ్లేందుకు పలుమార్లు ఫోన్ చేసినా కనీసం స్పందించలేదన్నారు. దీంతో ఆమెతోపాటు సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మునస్వామి, మద్దతుదారులు అందరూ వెదురుకుప్పం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఎస్సై అక్కడి నుంచి వెళ్లిపోయారని బాధితులు పేర్కొన్నారు. దాంతో పోలీస్ స్టేషన్ ఎదుటే బాధితులు ఆందోళన చేశారు. తమకు రక్షణ లేదని వాళ్లు చంపే కంటే తాము చచ్చిపోతామని కన్నీటిపర్యంతమయ్యారు. కొద్దిసేపు పోలింగ్‌ను నిలిపివేసిన అధికారులు ఆ తర్వాత ప్రారంభించారు.
●కమ్మ కండ్రిగలో అభ్యర్థుల ఆందోళన