ఈ నెల 16 నుంచి మొదటి విడతగా కరోనా టీకా వేయడానికి చిత్తూరు జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎన్.భరత్ గుప్తా తెలిపారు. కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంపై కలెక్టరేట్లో మంగళవారం జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 29 టీకా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. ప్రతి విభాగం నుంచి ఒక నోడల్ అధికారి టీకా కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని ఆదేశించారు.
కొవిడ్ వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ భరత్ గుప్తా
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కొవిడ్ వ్యాక్సినేషన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి చిత్తూరు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ భరత్ గుప్తా తెలిపారు. కార్యక్రమం నిర్వహణకు సంబంధించి అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు.
టీకా వేసిన అనంతరం ఎవరైనా అస్వస్థతకు గురైతే అత్యవసర చికిత్స అందించడానికి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు. 108 వాహనం అందుబాటులో ఉంచుకోవాలని... ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల సిబ్బంది, వైద్య విద్యార్థులకు టీకా వేయడానికి ఆయా కళాశాలల్లో కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వ్యాక్సిన్ రవాణా సమయంలో వాహనంతో పాటు పోలీసు భద్రత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయిలో తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారి, సీఐ, ఎస్ఐలు వ్యాక్సినేషన్ కేంద్రాలను పర్యవేక్షించాలని ఆదేశించారు.