పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సిద్ధమైంది. శనివారం నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని కూడా ప్రకటించింది. మరోవైపు జిల్లా అధికారులు తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. అధికారిక సమాచారం వచ్చాకనే ఈ విషయమై స్పందిస్తామని తెలిపారు. ఫలితంగా జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉందా? లేదా? అనేది సందేహంగా మారింది.
మీడియాలో చూశాకే తనకూ ఎన్నికల షెడ్యూల్ గురించి తెలిసిందని కలెక్టర్ భరత్‌గుప్తా అన్నారు. ఇదే తరుణంలో.. కోడ్ అమలులో ఉంటే ప్రస్తుతం పంపిణీ చేస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కొనసాగుతుందా? లేదా? అన్న చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. తొమ్మిదో తేదీ రెండో శనివారం కావడంతో అధిక శాతం మండలాల్లో పట్టాలు ఇవ్వలేదు. కొన్ని మండలాల్లో రెవెన్యూ అధికారులు పట్టాల పంపిణీ చేపట్టాలని భావించినా.. శుక్రవారం రాత్రి రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది.