చిత్తూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో చంద్రగిరిది ప్రత్యేక స్థానం. భౌగోళికంగా అతిపెద్ద నియోజకవర్గమైన చంద్రగిరిలో రాజకీయాలూ అంతే విస్తృతంగా సాగుతున్నాయి. తెదేపా ఇక్కడ మూడు సార్లు విజయం సాధించింది. 1999 నుంచి 2009 వరకు మూడు సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. రాష్ట్ర విభజనానంతర సమీకరణాల్లో వైకాపా నుంచి చెవిరెడ్డి భాస్కర రెడ్డి గెలుపొందగా... కాంగ్రెస్ నుంచి తెదేపాకి మారి పోటీ చేసిన గల్లా అరుణకుమారి అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఈ సారి తెదేపా నుంచి పులపర్తి నానీ, వైకాపా నుంచి సిట్టింగ్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎన్నికల బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే దాకా...
అభివృద్ధి వార్తల్లో కంటే వివాదాస్పద వార్తల్లోనే ఎక్కువగా నిలిచిన భాస్కర రెడ్డి...ప్రతిపక్ష నేత కావడంతో ప్రభుత్వం సహకరించలేదని... వ్యక్తిగతంగా ప్రజలకు అందుబాటులోనే ఉన్నానంటూ ప్రస్తుతం బరిలో దిగుతున్నారు. మూడు దశాబ్దాల పాటు తనదైన ముద్రతో చంద్రగిరిలో రాజకీయాలు సాగించిన అరుణకుమారి అనుచరుడిగా... వైఎస్ రాజశేఖరరెడ్డికి విధేయుడిగా భాస్కరరెడ్డి … రాజకీయాల్లో ఓనమాలు దిద్దారు. YS హయాంలో తుడా ఛైర్మన్ పదివితో పాటు, చంద్రగిరి జడ్పీటీసీ పదవులను ఆయన పొందారు. రాజశేఖరరెడ్డి మరణానంతరం వైకాపాలో చేరి జగన్కు ప్రధాన అనుచరుడిగా మారారు. గల్లా అరుణకుమారి కాంగ్రెస్ను వీడడంతో... ఆ పార్టీ ఓటు బ్యాంకును కలుపుకుంటూ... 2014 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో అనూహ్యంగా విజయం సాధించారు. ప్రభుత్వ వైఫల్యం, ప్రజల్లో తనపై ఉన్న నమ్మకమే ఈ సారి తనను గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.