ఏడాదిన్నరలో జమిలి ఎన్నికలు వస్తే వైకాపా ఇంటికెళ్లడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వైకాపా నైతికంగా పతనమైందని.. ప్రజలు తిరుగుబాటు చేస్తే అధికార పార్టీ నాయకులు పారిపోతారని వ్యాఖ్యానించారు. సొంత నియోజకవర్గం కుప్పంలో 3 రోజుల పర్యటనకు వచ్చిన చంద్రబాబు తొలిరోజు గురువారం గుడుపల్లె, కుప్పం గ్రామీణ మండలాల కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు మార్గమధ్యలో ప్రజలు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
‘పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ దౌర్జన్యాలు, బెదిరింపులతో తెదేపా కార్యకర్తలను భయపెట్టాలని చూసింది. నేను 24 క్లెమోర్‌మైన్‌లకే భయపడలేదు. వైకాపా నాయకుల తాటాకుల చప్పుళ్లకు బెదురుతానా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. తెదేపా కార్యకర్తలను అధికార పార్టీ నాయకులు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీటన్నింటికీ చక్రవడ్డీతో బదులిస్తామని హెచ్చరించారు. కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులను ఒక్క సంతకంతో రద్దు చేస్తానని భరోసా ఇచ్చారు. కుప్పంలో పులివెందుల రౌడీయిజం జరగనివ్వనన్నారు.
‘పులివెందుల, పుంగనూరు నియోజకవర్గాల్లో ఓటేసే పరిస్థితి లేదు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటే పుంగనూరు నేత (పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి) నియోజకవర్గంలో కూడా ఉండేవాడు కాదు. నన్ను ఇబ్బంది పెట్టాలనే కుప్పం ప్రజలపై కక్ష సాధిస్తున్నారు. పులివెందులలో మా పార్టీ గెలవకపోయినా గండికోట ద్వారా అక్కడి ప్రజలకు నీళ్లిచ్చాం. ఇక్కడ మాత్రం ఇప్పటివరకూ హంద్రీ- నీవా ద్వారా నీళ్లివ్వలేదు. పైగా పింఛన్లు, రేషన్‌కార్డులు తీసేస్తామని, అమ్మఒడి ఆపేస్తామని, అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరించి ఓట్లు వేయించుకుంటున్నారు’ అని చంద్రబాబు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్ రాజధర్మం పాటించాలని ఆయన హితవు పలికారు. ‘పంచాయతీ ఎన్నికల సమయంలో అక్రమాలను మీడియాకు తెలియజేస్తే ప్రజలకు వాస్తవాలు తెలిసి.. చీదరించుకుంటారని కార్యకర్తలకు చెప్పా. కొందరు కలెక్టర్లు, ఎస్పీల నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది’ అన్నారు. తప్పుడు కేసులు బనాయించిన పోలీసులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.