కుప్పం నియోజకవర్గ పరిధిలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో విధ్వంసం సృష్టించేందుకు పెద్ద ఎత్తున సంఘ విద్రోహ శక్తులు అక్కడ పాగా వేశాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఈ నెల 17వ తేదీన జరిగే పోలింగ్, కౌంటింగ్‌లో అక్కడ అరాచకాలు సృష్టించేందుకు వైకాపా ప్రోద్బలంతో వచ్చిన వారు కుప్పం పట్ఠణంలోని హోటళ్లు, లాడ్జిలలో తిష్టవేశారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. బయట వ్యక్తులకు సంబంధించిన ఫోటోలు, వాహనాల వివరాలను ఫిర్యాదు లేఖకు జతచేశారు. సజావుగా ఎన్నికలు జరిగేందుకు కుప్పంయేతరులను ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు బయటకు పంపాలని డిమాండ్ చేశారు.
బయట నుంచి వచ్చిన వారు నియోజకవర్గంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారనే అనుమానం తమకుందన్నారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలంటే అన్ని పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయటంతో పాటు అదనపు రక్షణ బలగాలు కేటాయించాలని చంద్రబాబు కోరారు.