మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబునాయుడి కుటుంబ ఆస్తులకే రక్షణ కరవైంది. ఏళ్ల కిందట భూములు కొనుక్కున్నా బంధువులే కదా అని రెవెన్యూ రికార్డుల్లో పేరు మార్చుకోకపోవడంతో చుట్టూ రాళ్లు పాతి వారు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
Chandrababu Land: నారావారిపల్లెలో చంద్రబాబు భూమి కబ్జాకు యత్నం - chandrababu latest news
09:59 February 18
38 సెంట్లు ఆక్రమించేందుకు యత్నం
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాపురంలోని సర్వేనంబరు 222లో 87 సెంట్లను నారా కృష్ణమనాయుడి నుంచి చంద్రబాబు తండ్రి ఖర్జూరనాయుడు 1989లో కొనుక్కుని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. భూమిని తన కుమారులు చంద్రబాబు, రామ్మూర్తినాయుడులకు ఇచ్చారు. తనకు వచ్చిన స్థలాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, తితిదే కల్యాణమండపాల నిర్మాణాలకు చంద్రబాబు ఉచితంగా ఇచ్చారు. రామ్మూర్తినాయుడికి వచ్చిన భాగం వారి కుటుంబం ఆధీనంలోనే ఉంది. రిజిస్ట్రేషన్ పత్రాలు ఉండటంతోపాటు బంధువుల నుంచి కొనుక్కున్నది కావడంతో రికార్డుల్లో పేరు మార్పిడిని పెద్దగా పట్టించుకోలేదు. ఈ అవకాశంగా రెవెన్యూ రికార్డుల్లో కృష్ణమనాయుడిపై ఉన్న భూమిని ఆయన భార్య సిద్ధమ్మ పేరుతో ఆన్‌లైన్‌లో వారి కుమారుడు రాజేంద్రనాయుడు నమోదు చేయించారు. భూమిని ఆక్రమించేందుకు 2రోజుల కిందట రాళ్లు తరలించారు. విషయం తెలుసుకుని రామ్మూర్తినాయుడి కుటుంబీకులు తమ రిజిస్ట్రేషన్ పత్రాలతో 2రోజుల కింద చంద్రగిరి తహసీల్దారు కార్యాలయాన్ని సంప్రదించారు. ఆన్‌లైన్‌లో పేరు మార్పిడిని కోరారు. సెలవులో ఉన్నానని, ఆర్‌ఐని పంపిస్తానని తహసీల్దారు చెప్పడంతో వెనుదిరిగారు. మరోవైపు రాజేంద్రనాయుడు గురువారంరాత్రి నుంచి స్థలం చుట్టూ రాళ్లు పాతించారు. దీనిపై విమర్శలు రావడంతో రెవెన్యూ సిబ్బంది హుటాహుటిన వివాదాస్పద స్థలాన్ని పరిశీలించారు. తమ వద్దనున్న దస్త్రాలను అందజేయాలని ఇరువర్గాలకు సూచించారు.
భిన్నవాదనలు..:కృష్ణమనాయుడి భూమిని ఖర్జూరనాయుడు కొన్నారని చంద్రబాబు బంధువు సుబ్రమణ్యంనాయుడు వివరించారు. సామాజిక అవసరాలకు ఇవ్వగా తమ ఆధీనంలో మిగిలిన భూమి వద్ద చంద్రబాబు సంక్రాంతి సమయంలో ముగ్గుల పోటీలు పెట్టించేవారని తెలిపారు. ‘ఖర్జూరనాయుడికి మా మామ కొంత భాగమే రాసిచ్చారు. అంతా ఇవ్వలేదు, అందుకే ఆన్‌లైన్‌లో పేరు మారలేదు’ అని రాజేంద్రనాయుడి భార్య రాణెమ్మ పేర్కొన్నారు. ‘రికార్డుపరంగా మాది అని తెలిశాకే రాళ్లు పాతాం. ఎవరి భూమి కబ్జా చేయడం లేదు. మా స్థలం వారు వాడుకున్నంతనే వారిదెలా అవుతుంది?’ అని ప్రశ్నించారు.
ఇదీ చదవండి :
CBN Fire On YSRCP: ఉగ్రవాదులను మించిన పాలన వైకాపాది: చంద్రబాబు