Chandrababu inquired Taraka Ratna's health condition : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో అస్వస్థతకు గురైన సినీనటుడు తారకరత్న కుప్పంలోని కేసీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పీఈఎస్ వైద్యకళాశాల ఆస్పత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. కుప్పం ఆస్పత్రిలో తారకరత్న ఆరోగ్య పరిస్థితిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సినీ నటుడు బాలకృష్ణ పర్యవేక్షిస్తున్నారు. పాదయాత్ర ముగిసిన తర్వాత తారకరత్నను పరామర్శించేందుకు లోకేశ్ కుప్పం పీఈసీ ఆస్పత్రికి వచ్చారు.
బెంగుళూరు నుంచి ప్రత్యేక వైద్యుల బృదం, మెరుగైన పరికరాలు కుప్పంకు తీసుకువచ్చారు. కుప్పంలోనే చికిత్స కొనసాగించే అవకాశాలపై లోకేశ్, బాలకృష్ణలతో వైద్య బృందం చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం కుప్పంలోనే తారకరత్నకు చికిత్స కొనసాగిస్తున్నారు. తారకరత్న భార్య కుప్పం వచ్చాక బెంగుళూరు తరలింపుపై కుటుంబ సభ్యులు తుదినిర్ణయం తీసుకోనున్నారు.
చంద్రబాబు ఆరా:అస్వస్థతకు గురైన తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ అధినేత చంద్రబాబు వివరాలను అడిగి తెలుసుకున్నారు. తారకరత్నకు వైద్యం అందిస్తున్న కుప్పం ఆసుపత్రి వైద్యులతో ఆయన మాట్లాడారు. ఆసుపత్రి వద్ద ఉన్న బాలకృష్ణతో పాటు, పార్టీ నేతలతో కూడా చంద్రబాబు మాట్లాడారు. తారకరత్నకు యాంజియోగ్రామ్ నిర్వహించామని, స్టంట్ అవసరం లేకుండానే తారకరత్న కోలుకున్నట్లు చంద్రబాబుకి వైద్యులు చెప్పారు. ముందు జాగ్రత్తగా వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రి వైద్యులను సంప్రదించారు. ఎయిర్ అంబులెన్స్‌లో తరలించాలన్న ఆలోచన మేరకు.. ఆయా అనుమతులపై చంద్రబాబు కర్నాటక సీఎం బొమ్మైని ఫోన్లో సంప్రదించారు.
నిలకడగా ఉంది :తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని బాలకృష్ణ తెలిపారు. ప్రస్తుతం బీపీ 120/80 చూపిస్తోందని, గుండెలో ఎడమవైపు 90 శాతం బ్లాక్ అయ్యిందని వైద్యులు వెల్లడించినట్లు చెప్పారు. ఇక్కడి వైద్యులు తీవ్రంగా కృషిచేస్తున్నారని బాలకృష్ణ పేర్కొన్నారు.