CHANDRABABU FIRES ON CM JAGAN : సీఎం జగన్‌కు ఓటమి భయం పట్టుకుందని.. పిరికితనంతో తప్పుడు కేసులు పెట్టి తమ పర్యటనలను అడ్డుకోవాలనుకుంటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. కొంతమంది పోలీసులు వాళ్ల స్వార్థం కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో అత్యవసర పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. కుప్పం నియోజకవర్గంలో రెండో రోజు పర్యటనలో భాగంగా రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజలు బాధపడుతుంటే.. శాడిస్ట్ సీఎం ఆనందపడుతున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. రోడ్డు షోలు, సభలపై నియంత్రణకు చీకటి జీవో తీసుకొచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అరాచకశక్తిగా మారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. పోలీసులు తీసుకెళ్లిన టీడీపీ చైతన్య రథం వాహనాన్ని వెంటనే తిరిగివ్వాలని డిమాండ్ చేశారు. చైతన్య రథాన్ని పోలీసులు తీసుకెళ్లినందుకు నిరసనగా ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి ఎం.ఎం. కల్యాణ మండపం వరకు చంద్రబాబు పాదయాత్రగా వెళ్లారు.
రోడ్డు షోలు రాష్ట్రానికి కొత్తా?:
40 ఏళ్లు పోరాడిన పార్టీ టీడీపీ అని.. ఎన్నో ఇబ్బందులను సమర్థంగా ఎదుర్కొన్నామన్నారు. రాష్ట్రాన్ని అంధకారం చేయకూడదని పోరాడుతున్నామని.. తప్పుడు కేసులు పెట్టి తమను అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎవరు కనపబడితే వాళ్లపై కేసు పెట్టి జైల్లో పెడతారా? అని నిలదీశారు. తాను సీఎంగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, షర్మిల, జగన్ పాదయాత్రలు చేశారని.. ఆ పాదయాత్రలకు పోలీసు భద్రత కల్పించినట్లు తెలిపారు. ఇప్పుడు వీళ్లు మాత్రం తన నియోజకవర్గంలో తిరుగుతుంటే అడ్డుపడుతున్నారని ఆగ్రహించారు. దాడి చేసి తిరిగి తమ పైనే కేసులు పెడుతున్నారన్నారు.