CBN FIRES ON JAGAN : తెలుగుదేశం సంపద సృష్టిస్తే.. వైకాపా దానిని విధ్వంసం చేస్తోందని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అధికారం, పోలీసులను అడ్డుపెట్టుకుని సీఎం మిడిసిపడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మూడున్నరేళ్లలో ఏం చేశారని.. కుప్పంలో జగన్ పర్యటిస్తున్నారని విమర్శించారు. చిత్తూరు జిల్లా జైలులో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలను పరామర్శించిన చంద్రబాబు.. పోలీసు కేసులు ఎదుర్కొంటున్న కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ప్రజాసమస్యల కోసం పోరాడే పార్టీ మాది.. కేసులకు భయపడే ప్రసక్తే లేదు.. ప్రభుత్వం పెడుతోన్న తప్పుడు కేసులు తమనేమీ చేయలేవని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సీఎం జగన్ నేర చరిత్రపై పోరాటం చేస్తామన్నారు. చట్టవిరుద్ధంగా పని చేస్తున్న పోలీసు అధికారుల్ని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కుప్పం అన్న క్యాంటీన్ ఘటనలో 72 తెదేపా నేతలపై కేసు పెట్టారని.. మరికొందరిపై హత్యాయత్నం కేసులు పెట్టారన్నారు. తెదేపా నేతలపై వివిధ సెక్షన్ల కింద పెట్టిన కేసులు దారుణమని మండిపడ్డారు. మీరు దాడులు చేసి.. తిరిగి మా నేతలపై కేసులు పెట్టారని.. సమావేశం పెట్టినప్పుడు ప్రజలు రారా అని ప్రశ్నించారు.
ప్రశాంతతకు మారుపేరైన కుప్పం నియోజకవర్గంలో అలజడులు సృష్టించేందుకే సీఎం జగన్ పర్యటించనున్నారని చంద్రబాబు విమర్శించారు. మూడేళ్లలో ఏం అభివృద్ధి చేశారని జగన్ చూడటానికి వస్తున్నారని ఆయన ప్రశ్నించారు. తన పర్యటన సందర్భంగా వైకాపా శ్రేణులు దాడులు చేయడమేగాక.. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేసిందని ఆయన విమర్శించారు. చిత్తూరు జిల్లా జైలులో ఉన్న వారిని చంద్రబాబు పరామర్శించారు. చంద్రబాబు రాక సందర్భంగా పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు తరలిరావడంతో జైలు పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.