Chandrababu fire on YSRCP: వైకాపాది తుమ్మితే ఊడిపోయే ముక్కు అని.. ఆ పార్టీకి సమయం దగ్గరపడిందని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. వైకాపా నాయకులు రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ గెలుస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని.. ఒక్క సీటు కూడా నెగ్గలేరని పేర్కొన్నారు. పులివెందులలోనూ వైకాపాను భూస్థాపితం చేస్తామని సవాల్ చేశారు. తెదేపా పోరాటానికి ప్రజలు అండగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. మూడు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా చంద్రబాబు తొలిరోజు బుధవారం చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం కొంగనపల్లి, కొల్లుపల్లి గ్రామాల్లో పర్యటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వైకాపా నాయకులు పులివెందులలో ఏం చేశామని ఓట్లు అడుగుతారు? రాజకీయం వేరు.. అభివృద్ధి వేరని నేను పులివెందులకే మొదట నీళ్లిచ్చాను. 40 ఏళ్లుగా తెదేపా జెండా ఎగిరిన గడ్డ కుప్పం. జగన్...ఈ నియోజకవర్గాన్ని పులివెందులలా మార్చలేవు’ అని నిప్పులు చెరిగారు. ‘వచ్చే ఎన్నికల్లో వైకాపా గెలిచే పరిస్థితి లేదు. అందుకే రౌడీయిజానికి దిగి విజయం సాధించాలని చూస్తున్నారు. నేను రౌడీలకే రౌడీనే. నీతి, న్యాయానికి తప్ప దేనికీ భయపడను. ఈ వైకాపా నాయకులకు భయపడతానా? ప్రజాధనాన్ని వైకాపా నాయకులు పందికొక్కుల్లా దోచుకుంటున్నారు. తెదేపా అధికారంలోకి వచ్చాక ఆ అవినీతి సొమ్మంతా కక్కిస్తా’ అని స్పష్టం చేశారు.
రూ.15 కోట్ల కంపెనీ రూ.500 కోట్ల భూములు కొంటుందా?
శ్రీ సత్యసాయి జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు అప్పటి వైఎస్ ప్రభుత్వం కేటాయించిన భూముల్లో 8,500 ఎకరాలను ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఆయన మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి కారుచౌకగా రూ.500 కోట్లకు కొట్టేసేందుకు పథకం పన్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘ఇందూ సంస్థకు.. లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరిట 8,844 ఎకరాలను వైఎస్ ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టింది. ఈ వ్యవహారంలో అవినీతి జరిగిందని సీబీఐ తేల్చింది.
ఈ కేసులో జగన్ 16 నెలలు జైల్లో ఉన్నారు. ఇప్పుడు బెంగళూరు- హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనే ఉన్న రూ.18 వేల కోట్లు- రూ.27 వేల కోట్లు విలువ చేసే భూమిని కారుచౌకగా అప్పగిస్తున్నారు. తీరా చూస్తే ఆ భూములు కొనే సంస్థ టర్నోవర్ రూ.15 కోట్లు. ఆ సంస్థకు రూ.500 కోట్లు చెల్లించే స్థోమత ఎక్కడి నుంచి వచ్చింది?’ అని ప్రశ్నించారు. చంద్రబాబు వెంట మాజీ మంత్రి అమరనాథరెడ్డి, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి గంటా నరహరి, తెదేపా రాష్ట్ర మీడియా సమన్వయకర్త శ్రీధర్‌వర్మ తదితరులు ఉన్నారు.