Chandrababu News:తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుప్పం మూడో రోజు పర్యటన భిన్నంగా సాగింది. తొలి రెండ్రోజులు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ఆయన.. మూడో రోజు పూర్తిగా పార్టీ కార్యకర్తలు, నేతలు, యువతతో సమావేశానికి ప్రాధాన్యత ఇచ్చారు. బస చేసిన అతిథిగృహంలో షాహి గార్మెంట్స్ పరిశ్రమ యాజమాన్యం, కార్మికుల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు సమావేశం నిర్వహించారు. తర్వాత శాంతిపురం మండలం శివపురం సమీపంలో నిర్మించనున్న సొంతింటి నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి గుడిపల్లె మండలం శెట్టిపల్లికి వెళ్లిన బాబు.. పార్టీ నేత జి.మునిరాజు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం బీసీఎన్ కళ్యాణ మండపంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ప్రజల వద్దకు వెళ్లే నేతలకు పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేశారు.
ఓట్లు తెచ్చే నాయకులను ప్రోత్సహిస్తానని ఓటర్లను దూరం చేసే నాయకులను పక్కన పెడతానని చంద్రబాబు హెచ్చరించారు. యువత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేలా వారిని ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమిస్తే.. తెలుగుదేశం పార్టీ ప్రతి వంద ఓట్లకు ఒక సెక్షన్ ఇన్‌ఛార్జ్‌ను పెడుతుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాను ఎదుర్కొనేందుకు యువ నాయకులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.