రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలు కాపాడాలంటూ డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ రాశారు. అధికార పార్టీ నాయకులు అదేపనిగా తెదేపా సానుభూతి పరులు, ఇతర వర్గాల ప్రజలపై దాడులు చేయడం పరిపాటి అయ్యిందని ధ్వజమెత్తారు.
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం బాల గంగనపల్లి పంచాయతీ కొత్త నాగురుపల్లి గ్రామంలో ఢిల్లీ రాణి అనే మహిళా రైతుకు చెందిన 100 మామిడి చెట్లను నరికేయడం అందుకు ఒక ఉదాహరణ అని వివరించారు. ఆమెకు ప్రభుత్వమే సేద్యం చేసుకునేందుకు భూమి మంజూరు చేసిందని పేర్కొన్నారు. అయితే రాణి తెదేపా సానుభూతిపరురాలు అనే అక్కసుతోనే కొందరు వైకాపా నాయకులు ఆమె భూమిలోకి అక్రమంగా చొరబడి, ఫెన్సింగ్ ధ్వంసం చేసి మామిడి చెట్లను నరికేశారని ఆరోపించారు.