CBN Kuppam Tour:రిటైర్‌మెంట్ బెన్‌ఫిట్స్‌ను రెండేళ్లు వాయిదా వేసేందుకే.. వైకాపా ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. బెదిరింపు రాజకీయాలకు అలవాటు పడిన జగన్...పీఆర్సీ విషయంలోనూ ఉద్యోగులతో పులివెందుల పంచాయతీ చేశారని ఆరోపించారు. జగన్‌కు ఇచ్చిన ఒక్క ఛాన్సే..ఆఖరి ఛాన్స్ కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
సొంత నియోజకవర్గం కుప్పంలో చంద్రబాబు మూడోరోజు విస్తృతంగా పర్యటించారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని పరిశీలించిన ఆయన.. పనులు త్వరగా పూర్తిచేయాలని స్థానిక నేతలను ఆదేశించారు. అనంతరం రామకుప్పానికి చెందిన దళితులు కుప్పం ఆర్‌అడ్‌బీ అతిథిగృహం వద్ద చంద్రబాబును కలిశారు. గ్రామంలో..అంబేడ్కర్ విగ్రహ వివాదంపై ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో ఎస్సీలపై దాడులు చూస్తుంటే ఆందోళన కలుగుతోందని చంద్రబాబు అన్నారు. ఎస్సీలను చంపేసుకుంటూ పోతే అడిగేవారు లేరనుకున్నారా ? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
"వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఒక ఎస్సీ మాస్కు పెట్టుకోలేదని కొట్టి చంపారు. ముఖ్యమంత్రి మాత్రం మాస్కు పెట్టుకోరు. ఎస్సీ, ఎస్టీలను అవమానిస్తే చూస్తూ ఊరుకోము. వారి మనోభావాలు దెబ్బతీస్తే సహించేది లేదు. రాజ్యాంగ హక్కులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీలకు అండగా ఉండాల్సిన పోలీసులు విఫలమయ్యారు. ఎస్సీలపై దాడి చేసిన వారిపై చర్యల్లేవు." - చంద్రబాబు
ఆ తర్వాక గుడిపల్లె మండలం శెట్టిపల్లె వెళ్లిన చంద్రబాబు.. అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. గుడికొత్తూరులో రోడ్‌షో నిర్వహించారు. ప్రభుత్వం సరఫరా చేసిన..రేషన్ బియ్యాన్ని చూపించి నాణ్యత లేని బియ్యాన్ని ప్రజలెలా తింటారని ప్రశ్నించారు. ఉద్యోగులను జగన్ మోసగించారని మండిపడ్డారు. హామీల అమలు గురించి జగన్‌ను ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.