దేశ సంస్కృతికి మూలమైన సంస్కృత భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ అన్నారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠాన్ని సందర్శించిన ఆయన... పలు అభివృద్ధికి కార్యక్రమాలకు శంకుస్థాపన, నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి విద్యాపీఠం ప్రాంగణంలో శోభాయాత్రను నిర్వహించారు. అంతకుముందు వేద విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన కేంద్రమంత్రికి వేదపండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సంస్కృత విద్యాపీఠంలో నిర్వహించిన కార్యక్రమంలో పోఖ్రియాల్ స్వయంగా రచించిన హిందీ పద్యమాలిక 'కోయి ముష్కిల్ నహీ'కి సంస్కృత అనువాద పుస్తకాన్ని ఆవిష్కరించారు.
తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్, కేంద్రమంత్రి రమేష్ పోఖ్రియాల్కు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. కార్యక్రమం మొత్తం సంస్కృతంలోనే నిర్వహించడాన్ని వ్యంగ్యంగా తప్పుపట్టిన ఎంపీ... తెలుగు సంప్రదాయాలకు, భాషకు సైతం చోటు కల్పించాలని కోరారు. స్థానికులకు విద్యాపీఠంలో ప్రవేశాలు కల్పించాలని కోరిన ఎంపీ.. సంస్కృత విద్యాపీఠానికి కేంద్రీయ విశ్వవిద్యాలయం హోదా కల్పించాలన్నారు.