కనుమ నాడు చిత్తూరు జిల్లా జిల్లాలోని రంగంపేట సహా పలు గ్రామాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే పశువుల పండుగ నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. కరోనా ఆంక్షలు, పశువులను హింసించే ఆచారంగా భావించిన పోలీసులు... ఈ ఏడాది పశువుల పండుగ నిర్వహణపై ఆంక్షలు విధించారు
చిత్తూరు జిల్లా రంగంపేట సహా కొన్ని గ్రామాల్లో ఏటా జనవరి 15 నుంచి నెల చివరి వరకు పశువుల పండుగ జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఏడాది పొడవునా చేదోడువాదోడుగా ఉంటూ... సాగులో సాయంగా నిలిచిన పశువులను ఆరాధిస్తూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. పండుగ ముందు రోజు నుంచే పశువులను శుభ్రంగా కడిగి... కొమ్ములకు పలకలు కట్టి అలంకరిస్తారు. ఊరు చివర పశువుల దొడ్డి ఏర్పాటు చేసి పశువులను అక్కడికి చేరుస్తారు. అప్పటికే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి.... గ్రామంలోని ఇరుకు సందుల్లో చేరుకున్న జనాల మధ్యకు ఒక్కొక్కటిగా పశువుల్ని వదులుతారు. వాటిని నిలువరించి కొమ్ములకు కట్టిన చెక్క పలకలను దక్కించుకునేందుకు యువకులు పోటీపడతారు.