Bus accident: వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు బంధువులు, స్నేహితులు సంతోషంగా బస్సులో బయలుదేరారు. కానీ ఆ బస్సు ఒక్కసారిగా బోల్తా పడటంతో అందులోని 27 మంది గాయపడ్డారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తంబళ్లపల్లె మండలం సింగిమానుబురుజు గ్రామానికి చెందిన యువతికి, కురబలకోట మండలం బుడ్డారెడ్డిగారిపల్లెకు చెందిన యువకుడికి సోమవారం తెల్లవారుజామున వివాహం జరగనుంది. వీరి వివాహం బి.కొత్తకోట మండలం కాండ్లమడుగుక్రాస్‌లోని కల్యాణ మండపంలో జరగాల్సి ఉంది.
పెళ్లి కుమార్తె బంధువులు 30 మందికిపైగా రిసెప్షన్‌కు ఓ ప్రైవేటు కళాశాల బస్సులో ఆదివారం రాత్రి బయలుదేరారు. వర్షం పడుతుండటంతో బస్సు డ్రైవర్ కురబలకోట మండలం దాదంవారిపల్లె - తూపల్లె మధ్యలో వాహనాన్ని చూసుకోకుండా గుంతలోకి దించాడు. యాక్సిల్ విరిగి టైరుపై పడటంతో బస్సు పక్కకు బోల్తాపడింది. 27 మంది గాయపడగా 108 అంబులెన్సులో మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో రెడ్డెమ్మ (60), భారతమ్మ (40) పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు. ముదివేడు ఎస్సై సుకుమార్, సిబ్బందితో వెళ్లి రోడ్డుకు అడ్డుగా ఉన్న బస్సును జేసీబీ సాయంతో పక్కకు తీయించారు. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు ఎస్సై తెలిపారు. పెళ్లికుమార్తె ప్రత్యేక కారులో ముందుగా వెళ్లడంతో ప్రమాదం తప్పింది.