రెండు రోజుల క్రితం తిరుపతిలోని బాలాజీ లింక్ బస్టాండ్ ఆవరణలో అపహరణకు గురైన నాలుగు నెలల బాలుడి కేసును తిరుపతి అర్బన్ పోలీసులు ఛేదించారు. మైసూరులో బాలుడిని గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
BOY SAFE: తిరుపతిలో కిడ్నాప్..మైసూరులో ఆచూకీ..సేఫ్‌గా తల్లిదండ్రుల చెంతకు - తిరుపతిలో బాలుడి కిడ్నాప్
తిరుపతిలో రెండు రోజుల క్రితం కిడ్నాప్‌నకు గురైన బాలుడిని పోలీసులు మైసూరులో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడిని ఎత్తుకెళ్లిన ఆశ అనే మహిళను అరెస్టు చేశారు.
బాలుడి తల్లి గంగులమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. రెండు రోజుల్లోనే బాలుడి ఆచూకీని కనుగొన్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు తెలిపారు. బాలాజీ లింక్ బస్టాండ్‌లో ఉన్న కామన్ బాత్రూంలో గంగులమ్మ.. స్నానం చేసేందుకు వెళ్ళిన సమయంలో బాలుడిని మైసూరుకు చెందిన యాచకురాలు ఆశ ఎత్తుకెళ్ళినట్లు ఎస్పీ తెలిపారు. సీసీ టీవీల ఆధారంగా దర్యాప్తు చేపట్టామని అన్నారు. ఆశ మైసూరులో ఉన్నట్లు తెలుసుకుని.. బాలుడిని రక్షించామన్నారు. ఆశను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.