ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మాజీ మంత్రి బొజ్జల కన్నుమూత.. ఆదివారం స్వగ్రామంలో అంత్యక్రియలు

Condolence to Bojjala: మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అంత్యక్రియలు ఆదివారం చిత్తూరు జిల్లాలోని ఆయన స్వగ్రామంలో జరగనున్నాయి. నేడు ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్‌ నుంచి సొంతూరుకు తరలించనున్నారు. బొజ్జల మృతిపట్ల విచారం వ్యక్తం చేసిన తెలుగుదేశం నేతలు.. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. బొజ్జల మృతి పట్ల సీఎం జగన్ సంతాపం తెలిపారు.

మాజీ మంత్రి బొజ్జల కన్నుమూత
మాజీ మంత్రి బొజ్జల కన్నుమూత

By

Published : May 7, 2022, 5:59 AM IST

Updated : May 7, 2022, 6:06 AM IST

మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ అంత్యక్రియలు ఆదివారం ఉదయం 11.30 గంటలకు స్వగ్రామం ఉరందూర్‌లో నిర్వహించనున్నట్లు ఆయన కుమారుడు బొజ్జల సుధీర్‌రెడ్డి తెలిపారు. తెదేపా అధినేత చంద్రబాబు అంత్యక్రియలకు హాజరవుతారని వెల్లడించారు . ఉదయం బొజ్జల భౌతికకాయం బేగంపేట విమానాశ్రయం నుంచి రేణిగుంటకు తరలిస్తామన్నారు. తెదేపా సీనియర్‌ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి పట్ల ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని బొజ్జల నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. బొజ్జలతో తమకు విడదీయరాని రాజకీయ బంధుత్వం ఉందన్నారు.
రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులు బొజ్జల నివాసానికి వచ్చి ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ బొజ్జలకు నివాళి అర్పించారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు, సీపీఐ నేతలు కె.నారాయణ, రామకృష్ణ, మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీత, కామినేని శ్రీనివాసరావు, తెదేపా నేత జేసీ దివాకర్‌రెడ్డి, కరణం బలరామ్, వల్లభనేని వంశీ, ఎన్టీఆర్‌ తనయుడు రామకృష్ణ బొజ్జలకు నివాళులర్పించారు . ఆయన సేవలను కొనియాడారు.

బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందన్న హిందూపురం శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బొజ్జల స్వగ్రామమైన శ్రీకాళహస్తి మండలం ఊరందూరు లో విషాద ఛాయలు అలముకున్నాయి. గోపాలకృష్ణారెడ్డి మరణవార్త తెలుసుకున్న ఊరందూరు ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన చిత్రపటానికి నివాళులర్పించి.. ఆయన సేవలను స్మరించుకున్నారు.

సంతాపం తెలిపిన గవర్నర్‌, సీఎం జగన్‌ :బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్నివ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. గోపాలకృష్ణారెడ్డి మృతికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇదీ చదవండి:మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత

Last Updated : May 7, 2022, 6:06 AM IST

ABOUT THE AUTHOR

...view details