పోలీసులు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారితే మారితే తీవ్ర పరిణామాలు ఉంటాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు హెచ్చరించారు. బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేయాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గి తప్పుడు కేసులు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు. స్థానిక శాసనసభ్యుడు ప్రోద్బలంతోనే శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జ్ వినుత ఇళ్లు, వాహనం పై దాడి చేయడాన్ని ఆయన ఖండించారు.
చిత్తూరు జిల్లా భాజపా, జనసేన నాయకులతో కలిసి రేణిగుంటలోని వినుత ఇంటికి వెళ్లిన వీర్రాజు.... ఘటన పూర్వాపరాలను తెలుసుకున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో ప్రతిపక్ష నాయకుల మీద, కార్యకర్తలతో పాటు ఆస్తుల మీద అధికార వైకాపా గూండాలు దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. తప్పుడు కేసులు బనాయించి అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపా-జనసేన పార్టీలు ఇలాంటి దాడులకు బెదరవని...అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్న అరాచకాలను తిప్పికొడతామని ప్రకటించారు.