చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం చింతపెంట పంచాయతీలో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మండల స్థాయి నాయకులు, అధికారులతో కలిసి ఇంటింటి పర్యటన చేపట్టారు. ప్రభుత్వం పథకాల మంజూరు గురించి లబ్ధిదారులను వాకబు చేస్తూ ముందుకు సాగారు. పలుచోట్ల మహిళలు నారాయణ స్వామికి మంగళ హారతులు ఇవ్వగా.. కొన్నిచోట్ల మహిళలు మంత్రిని కనీసం పలకరించిన దాఖలాలు కూడా లేవు.
సమస్య చెప్పుకున్న రైతు.. "నువ్వు తెదేపా మనిషివి" అన్న డిప్యూటీ సీఎం! - చిత్తూరు జిల్లా తాజా వార్తలు
'గడప గడపకు మన ప్రభుత్వం' పేరిట వైకాపా సర్కార్ చేపట్టిన కార్యక్రమంలో.. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలో ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి పర్యటించారు. ఈ సందర్భంగా ఓ యువరైతు తాను ఎదుర్కొన్న ఇబ్బందులు చెప్పారు. దీనికి అసహనం వ్యక్తం చేసిన ఉప ముఖ్యమంత్రి.. "నువ్వు తెలుగుదేశం సానుభూతిపరుడివి కాబట్టే ఇలా ప్రశ్నిస్తున్నావు" అని అన్నారు.
కాగా.. చింతపెంట పంచాయతీలోని ఓఎస్సీ కాలనీలో నారాయణస్వామి ఓ యువ రైతును పలకరించారు. దీంతో.. అతడు రెవెన్యూ విభాగం నుంచి తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలియజేశారు. సంక్షేమ పథకాలను ప్రభుత్వం అందిస్తుందని మంత్రి పేర్కొనగా.. యువ రైతు తన కష్టాలను ఏకరువు పెట్టాడు. దీంతో.. అసహనానికి గురైన ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి.. "నా పర్యటనలో ఎక్కడా వ్యతిరేకత ఎదురు కాలేదు. నువ్వు తెలుగుదేశం సానుభూతిపరుడివి కాబట్టే ఇలా ప్రశ్నిస్తున్నావు" అంటూ నారాయణస్వామి రైతును గద్దించారు. ఎవరి ప్రోద్బలంతోనో మాట్లాడుతున్న యువరైతు సమస్యను.. క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఇవీ చదవండి: