కరోనా వైరస్... పెద్ద, చిన్న... పేద, ధనిక అనే తేడాలేకుండా దాడి చేస్తోంది. ఈ భయంకర వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండాలంటే భౌతిక దూరం పాటించాలని అందరూ సూచిస్తున్నారు. అందుకే ఇల్లు కదలొద్దని చెబుతున్నారు. ఇక వైరస్ ప్రభావిత ప్రాంతాలైన రెడ్‌జోన్లవైపు కనీసం తొంగి చూడొద్దని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ కాదని వెళ్తే వైరస్ సంక్రమిస్తుందని చెప్తున్నారు. కానీ చిత్తూరు జిల్లాలో ఏడాది వయసున్నబాబు ఒకట్రెండు కాదు ఏకంగా 17 రోజులు కరోనా వైరస్ చట్రంలోనే ఉంటూ సురక్షితంగా బయటపడ్డాడు.
చిత్తూరు జిల్లా నగరికి చెందిన ఓ వ్యక్తి దిల్లీ మత ప్రార్థనలకు వెళ్లివచ్చాడు. అ తర్వాత ఆయన కుటుంబంలో ఓ మహిళకు వైరస్ వ్యాపించింది. ఆమెకు ఓ ఏడాది వయసున్న బాబు ఉన్నాడు. వ్యాధిగ్రస్తురాలైన ఆ తల్లిని అధికారులు చిత్తూరు ప్రభుత్వాసుపత్రిలోని ఐసొలేషన్ వార్డుకు తరలించారు. చిన్నారి ఆలనాపాలన చూసుకునేందుకు ఎవరూ ముందుకు రాక... తప్పనిసరి పరిస్థితుల్లో బాబునూ తల్లి వద్దే ఉంచారు.