చిత్తూరు జిల్లాలో అత్యంత మారుమూల నియోజకవర్గం తంబళ్లపల్లి ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు మేదస్సుకు పదును పెడుతున్నారు. నిత్యం కరవుతో నలిగిపోతున్న ఈ ప్రాంత రైతులు, కూలీల పిల్లలు.. తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను చూసి చదువులో రాణించడంతో పాటు నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు.
తమ చుట్టూ జరుగుతున్న ఎన్నో కార్యక్రమాలు, పనులు, యంత్రాల నిర్వహణ, వినియోగం తదితర అంశాలను పరిశీలిస్తూ.. భవిష్యత్తులో ప్రజలు ఎదుర్కోబోతున్న నిత్యావసరాల కొరతను దృష్టిలో పెట్టుకొని కొత్తదనాన్ని సృష్టిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులను తట్టుకోవడానికి ఉపయోగపడే వస్తువులు, యంత్రాలను తయారు చేయడానికి కొత్త నమూనాలు కనిపెడుతున్నారు. భవిష్యత్తులో తలెత్తబోయే డీజిల్, పెట్రోల్ కొరతను తట్టుకోవడానికి నీటి ఒత్తిడితో నడిచే యంత్రాల తయారీకి నమూనాలు తయారు చేశారు.