నిల్చున్న మూర్తిగా... అత్తివరద రాజస్వామి దర్శనం - నలభై ఏళ్లకోసారి దర్శనం
40 ఏళ్లకి ఓసారి భక్తులకు 48 రోజులపాటు దర్శనమిస్తారు కంచి అత్తి వరదరాజ స్వామి. ఆగష్టు 1 నుంచి 17వ తేదీ వరకూ నిల్చున్న మూర్తిగా భక్తులకు దర్శనమివ్ననున్నారు.
నలభై ఏళ్ల పాటు ఆలయ కోనేటి గర్భంలో ఉండి 40 సంవత్సరాలకోసారి కంచి అత్తి వరద రాజస్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. గత 29 రోజులుగా శయన మూర్తిగా ఆశీస్సులు అందిస్తున్న స్వామి వారు ఈ ఆగష్టు 1 నుంచి 17వ తేదీ వరకూ నిల్చున్న రూపంలో దీవించనున్నారు. ఆగష్టు 18వ తేదీన వరదరాజ స్వామి తిరిగి ఆలయ కోనేటి జలగర్భంలోకి వెళ్లనున్నారు. మరో 40 సంవత్సరాల తర్వాత మరలా భక్తులకు 48 రోజుల పాటు దర్శనమిస్తారు. శయన మూర్తిగా దర్శనం ఇచ్చే ఆఖరి రోజైన 31 వ తేదీ నాడు దర్శన వేళల్లో మార్పులు చేసినట్లు జిల్లా పాలనాధికారి పొన్నయ్యన్ తెలిపారు. 31 వ తేదీ బుధవారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యహ్నం 12 వరకు మాత్రమే సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఆన్ లైన్లో బుక్ చేసుకున్న వారిని మధ్యాహ్నం 12 నుంచి 3గంటల వరకు అనుమతిస్తారు.
స్వామి వారి అరుదైన దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశం నలుమూలల నుంచి కాంచీపురానికి భక్తులు పోటెత్తారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సహా పలువురు ప్రముఖులు అత్తి వరదున్ని దర్శించుకున్నారు.