అశ్వవాహనంలో విహరించిన కల్కి భగవానుడు - తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం రాత్రి శ్రీనివాసుడి అశ్వవాహన సేవ.. కన్నుల పండువగా జరిగింది. స్వామివారు అశ్వ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు.
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆఖరి వాహనమైన అశ్వవాహన సేవ తిరుమలలో వైభవంగా జరిగింది. ఎనిమిది రోజులుగా వివిధ వాహన సేవలపై దర్శన మిచ్చిన శ్రీవారి ఉత్సవాలలో చివరగా కల్కి ఆవతారంలో సాక్షాత్కరించారు. విష్ణుదేవుని దశావతరాల్లో ఆఖరిదే కల్కి. కలియుగాంతంలో విష్ణుదేవుడు కల్కిరూపం ధరించి, చర్ణాకోలు చేతబూని అశ్వవాహనధారుదై దుష్టజన సంహారం, శిష్టజన సంరక్షణ చేసి ధర్మాన్ని స్థాపిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. వాహనసేవ వరాహస్వామివారి ఆలయం వద్దకు చేరుకునే సమయానికి వర్షం ప్రారంభమైంది. ఘటాటోపం నీడలో వాహన సేవసాగింది. మంగళవారం చక్రస్నానం ఘట్టం జరగనుంది.