ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అరణియార్‌.. ఆదుకోవటం లేదు - పిచ్చాటూరు మత్స్యకారుల వెతలు

వల విసిరితే కానీ పూటగడవని వృత్తి వారిది. కానీ వారి దగ్గర వలలు ఉండవు. పడవ లేనిదే కదల్లేని పని వారిది. కానీ వారి చెంత నావల జాడే కనిపించదు. బతుకుదెరువు కోసం, నమ్ముకున్న వృత్తి కోసం... నీటిలో నిత్య సంఘర్షణే వారి జీవితం. మరో ఉపాధికి అవకాశం లేక... ప్రమాదపుటంచుల్లోనే బతుకుబండి లాగుతున్న చిత్తూరు జిల్లా అరణియార్‌ ప్రాజెక్టు ఆధారిత మత్స్యకారుల వెతలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

araniyar project fisher mans struggles
అరణియార్‌ ఆదుకోవటం లేదు

By

Published : Jun 18, 2020, 2:48 PM IST

అరణియార్‌ ఆదుకోవటం లేదు

చిత్తూరు జిల్లా పిచ్చాటూరు ప్రాంతంలో... 1958లో నిర్మించిన మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టు అరణియార్‌. పిచ్చాటూరు మండల పరిధిలోని 12 గ్రామాల్లో 9 వేల ఎకరాలకు సాగు నీరందించే ఈ ప్రాజెక్టు... మత్స్యాభివృద్ధి కేంద్రంగా పేరుగాంచింది. పిచ్చాటూరు, సత్యవేడు, విజయపురం, నిండ్ర, నాగలాపురానికి చెందిన 2వేల మందికిపైగా మత్య్సకారులు... ప్రాజెక్టుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మత్య్సాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన 7 చేపపిల్లల ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటి అరణియార్ సమీపంలోనే ఉంది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ ప్రాజెక్టు... ఇప్పటికీ మత్య్సకారుల జీవితాల్లో వెలుగులు నింపలేకపోతోంది. సుమారు 60 ఏళ్లుగా వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న వారికి... కనీస సదుపాయాల కల్పనలో అంతులేని నిర్లక్ష్యం కనిపిస్తోంది.

వేటకు వెళ్లేందుకు పడవలు ఉండవు. చేపలు పట్టేందుకు వలలు అందుబాటులో లేవు. ఈ దయనీయ స్థితిలో.. చెట్ల దుంగలు, థర్మాకోల్ అట్టలు, ప్లాస్టిక్ పైపులనే పడవలుగా మార్చుకుని... చేపల వేట సాగిస్తూ జాలర్లు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. బలమైన గాలులకు మత్స్యకారుల తాత్కాలిక ఏర్పాట్లు తిరగబడి... రిజర్వాయర్‌లోనే ప్రాణాలు కోల్పోతున్న ఉదంతాలు అనేకం. ఇన్ని వేల మందిలో ఒక్కరిద్దరు మినహా... సొంత బోట్లలో వేటకు వెళుతున్న వారే కనిపించరంటే... మత్స్యకారుల కష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

రాయితీపై ప్రభుత్వం పడవలు, వలలు ఇస్తున్నా... అతి కొద్దిమందికే దక్కాయని మత్య్సకారులు చెబుతున్నారు. ఇప్పటికైనా సర్కారు పెద్ద మనసు చేసుకుని అండగా నిలవాలని వేడుకుంటున్నారు.

అరణియార్ ప్రాజెక్టుపై ఆధారపడి వేల మంది జాలర్లు జీవనం సాగిస్తున్నా... నీళ్లు నింపడంలోనూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. కైలాసగిరి రిజర్వాయర్ నుంచి పైపులైన్ల ద్వారా అరణియార్‌కు నీటిని తరలిస్తామని చెప్పి ఏళ్లు గడుస్తున్నా... ఫలితం మాత్రం లేదని మత్స్యకారులు వాపోతున్నారు. గాలేరు-నగరి సుజల స్రవంతి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో... అరణియార్ పూర్తిగా వర్షాధారితంగా మిగిలిపోయిందని ఆవేదన చెందుతున్నారు.

ఇదీ చదవండి:తిరుపతిలో భారీగా గంజాయి పట్టివేత

ABOUT THE AUTHOR

...view details