శ్రీవారి సేవకు ఏడాదికి 250 టన్నుల పుష్పాలు - tirupathi
అలంకార ప్రియుడైన శ్రీవారి సేవకు నిత్యం వందల కేజీల పుష్పాలను వాడుతున్నారు. ఏడాదికి 200కి పైగా టన్నుల పూలను వినియోగిస్తున్నారు.
కలియుగ దైవంగా భక్తులు కొలిచే తిరుమల వెంకటేశ్వరస్వామికి నిత్యం సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు భారీగా పూలను వినియోగిస్తున్నారు. రోజూ శ్రీవారి అలంకారాణానికి 250 నుంచి 300 కేజీల పుష్పాలను ఉపయోగిస్తారు. 12 రకాల సంప్రదాయ పుష్పాలు... 6 రకాల పత్రాలతో స్వామి వారికి పూలమాలలు తయారు చేస్తారు. ఇక బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక రోజుల్లో దేవాలయ ముస్తాబుకు... స్వామి సేవకు వందల కేజీల పూల వినియోగం ఉంటుంది. పూల మాలలను తితిదే సిబ్బందితో పాటు శ్రీవారి సేవకులు, భక్తులు రూపొందిస్తారు. తితిదే సమకూర్చే పూలతో పాటు భక్తులు కూడా తమ వంతు సాయం చేస్తుంటారు. పుష్ప కైంకర్యం రూపంలో వివిధ రాష్ట్రాల నుంచి ఉచితంగా స్వామివారికి పూలను పంపుతుంటారు భక్తులు. ఎక్కువగా తమిళనాడు నుంచి 60 శాతం, కర్ణాటక నుంచి 30 శాతం పుష్పాలు కానుకగా వస్తుంటాయి.