పొరుగు దేశాల యాప్ ద్వారా వచ్చే ఫోన్ కాల్స్‌ను రూటర్ ద్వారా మళ్లించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి అక్రమార్జనకు పాల్పడుతున్న ముఠా గుట్టును చిత్తూరు పోలీసులు రట్టు చేశారు. కుప్పం కేంద్రంగా మూడేళ్లుగా సాగుతున్న రహస్య దందాను ప్రత్యేక బృందం పోలీసులు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు
రూటర్ ద్వారా మోసం..
పొరుగు దేశాల్లో చట్టపరమైన వొయ్ప్(వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్) యాప్ కాల్స్ స్థానికంగా చట్టవిరుద్ధమైనా కుప్పానికి చెందిన కొందరు వ్యక్తులు దర్జాగా కాల్స్‌ను రూటర్ ద్వారా మళ్లించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. నిజానికి ఇలాంటి కాల్స్‌ను రూటర్ ద్వారా ఇతర సెల్ నెట్‌వర్క్‌కు మళ్లిస్తే టీఎస్‌పీ(టెలికామ్ సర్సీస్ ప్రొవైడర్), ఎంఎస్‌పీ(మొబైల్ సర్సీస్ ప్రొవైడర్)కు ప్రతి నిమిషానికి 60 పైసలు చెల్లించాల్సి ఉంటుంది.
సిమ్‌లతో నగదును కొట్టేస్తున్నారు.
పొరుగు దేశానికి చెందిన వ్యక్తులు వొయ్ప్ యాప్‌ను రూపొందించగా కుప్పం వ్యక్తులు వాటిని కొనుగోలు చేశారు. సుమారు 5 సిమ్ స్వాపింగ్ బాక్సుల్లో సిమ్‌లను అమర్చారు. దుబాయ్, సౌదీ, అమెరికా, ఇతర దేశాల నుంచి వచ్చే అంతర్జాల కాల్స్‌ను రూటర్ ద్వారా ఇతరుల పేరుపై ఉన్న సిమ్‌కు మళ్లిస్తున్నారు. నిజానికి రూటర్ ద్వారా మళ్లించే కాల్స్‌కు ప్రతి నిమిషానికి 60 పైసలు ప్రభుత్వానికి జమకావాల్సి ఉండగా అలా జరగడం లేదు.
ఆ నగదు యాప్ నిర్వాహకులకు వెళుతుండగా స్థానికంగా కాల్స్‌ను మళ్లిస్తున్న వారికి కమీషను రూపంలో ప్రతి నిమిషానికి సుమారు 6 పైసలు నుంచి 7 పైసలు జమ అవుతున్నట్లు తెలిసింది. ఇలా ప్రతి నిమిషం వినియోగిస్తున్న 5 సిమ్ బాక్సుల్లోని 150 సిమ్‌ల ద్వారా గంటకు రూ.600 నుంచి రూ.700 చొప్పున ఆర్జిస్తున్నారు. ఇలా నెల నెలా రూ.లక్షల్లో అక్రమార్జన చేస్తున్న విషయాన్ని ప్రత్యేక విభాగం పోలీసులు గుర్తించారు. శనివారం ఆకస్మికంగా ముఠాపై దాడులు నిర్వహించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సిమ్ బాక్సులు, అందులో పలువురి పేరుపై పొందిన సిమ్‌లు, చరవాణులు స్వాధీనం చేసుకున్నారు. ముఠాలో మరికొందరి పాత్ర కూడా ఉందని తేలడంతో రహస్యంగా దర్యాప్తు చేపడుతున్నారు. నేడో, రేపో నిందితులను అరెస్టు చూపనున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి:
స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. కనీస సౌకర్యాలు కలేనా?