Yuvagalam 13th day : రాష్ట్రానికి జగన్ చేసిన నష్టం.. దశాబ్దం తర్వాత అనుభవంలోకి వస్తుందని లోకేశ్ విమర్శించారు. 13వ రోజు పాదయాత్రలో వివిధ వర్గాలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎన్ ఆర్ పేటలోని ఎన్టీఆర్ కూడలిలో లోకేశ్ మాట్లాడుతుండగా.. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించడం కాసేపు ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రజలను పలకరిస్తూ, వారితో మాట్లాడుతూ.. సమస్యలు తెలుసుకుంటూ 13వరోజూ లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగింది.
మంగళవారం రాత్రి చిత్తూరు జిల్లా దిగువమాసపల్లెలో బస చేసిన లోకేశ్ ఈ ఉదయం.. ఈ గ్రామంలోనే బీసీ వర్గాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను విన్న లోకేశ్.. అధికారంలోకి రాగానే పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత యాత్రను కొనసాగించగా ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. దారిపొడవునా ఎదురొచ్చే గ్రామాల్లో మహిళలు హారతులు పట్టి లోకేశ్‌ను స్వాగతించారు.
యువతకు భరోసా... పాదయాత్రలో భాగంగా చిత్తూరు గ్రామీణ మండలం కృష్ణాపురం చేరుకొన్న లోకేశ్ యువతతో ముఖామూఖి నిర్వహించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ఏ నోటిఫికేషన్ విడుదల చేయలేదని... చిత్తూరు జిల్లాకు విశ్వవిద్యాలయం లేదని విద్యార్థులు లోకేశ్‌కు వివరించారు. పీజు రీయింబర్స్‌మెంటు సరిగా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రాత్రి ఏ ఆత్మతో మాట్లాడుతారో గానీ ఉదయం లేచి విచిత్ర నిర్ణయాలు తీసుకొంటారని లోకేశ్ ఎద్దేవా చేశారు. యువతీయువకులు ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడేందుకే యువగళం వేదిక ఏర్పాటు చేశామన్నారు. సభలకు అనుమతి ఇవ్వడానికి విచిత్రమైన ఆంక్షలు విధించి.. ప్రజాగొంతు నొక్కేస్తున్నారని ఆరోపించారు. తెదేపా అధికారంలోకి వచ్చాక చిత్తూరులో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. తెదేపా అధికారంలోకి వస్తే సచివాలయ ఉద్యోగులను తొలగిస్తారన్న ప్రచారంలో వాస్తవం లేదని.. సచివాలయ ఉద్యోగుల విధులను స్ట్రీమ్ లైన్ చేస్తామన్నారు. స్వర్ణకారులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని, ఇండస్ట్రీని డెవలప్మెంట్ చేయాలన్నది మా ఉద్దేశం అని లోకేశ్ తెలిపారు. గొర్రెల పంపిణీ కార్యక్రమం కూడా తీసుకురావడంతో పాటు వాటికి ఇన్సూరెన్స్ కూడా చేయిస్తాం.. ఆదరణ పథకం మళ్లీ తీసుకువస్తామని లోకేశ్ భరోసా కల్పించారు.