ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వినూత్న ఆలోచన... సాయం కోరిన క్షణాల్లోనే రక్షణ - టెక్ హ్యూమనిటీ వార్తలు

ఆపదలో ఉన్న వారిని క్షణాల్లో రక్షించేలా ఓ ప్రాజెక్టును తయారు చేశాడు చిత్తూరు జిల్లాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి. పోలీసులు వచ్చేలోపు ఆకతాయిల పని పట్టేందుకు ఓ నమూనాను రూపొందించాడు. దీనిని పూర్తి చేస్తే ఎన్నో నేరాలను అదుపు చేయవచ్చని అతను చెబుతున్నాడు.

tech humanity
tech humanity

By

Published : Dec 20, 2020, 4:12 PM IST

Updated : Dec 20, 2020, 4:44 PM IST

వినూత్న ఆలోచన... సాయం కోరిన క్షణాల్లోనే రక్షణ

మహిళల్ని వేధించే ఆకతాయిల ఆట కట్టించేందుకు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెకు చెందిన రెడ్డి ప్రసాద్ అనే ఇంజినీరింగ్ విద్యార్థి వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాడు. ఏదైనా అఘాయిత్యం జరగకముందే బాధిత మహిళలను క్షేమంగా రక్షించేలా టెక్ హ్యూమనిటీ పేరుతో ఓ ప్రాజెక్టును రూపొందించాడు.

పోలీసులు వచ్చే లోపు బాధితులకు రక్షణ

ప్రసాద్ తయారు చేసిన నమూనా ప్రకారం... మొదటగా డ్రోన్​కు ప్లాష్ లైట్, కెమెరా, పెప్పర్ స్ప్రే, సైరన్, పొగ కంటైనర్ అమర్చుతారు. ఆపదలో ఉన్న మహిళలు తమ వద్ద ఉన్న రిమోట్​ను లేదా మొబైల్​ ఫోన్​లోని అప్లికేషన్​లోని మీటను నొక్కగానే పోలీసు కంట్రోల్​ రూంకు, సన్నిహితులకు ఆమె ఉన్న ప్రాంతం(లొకేషన్)సమాచారం వెళ్లేలా పరికరాలు తయారు చేస్తారు. వీటి వల్ల బాధిత మహిళ నుంచి సమాచారం వచ్చిన వెంటనే లొకేషన్ ఆధారంగా ముందుగానే సిద్ధం చేసి ఉంచిన డ్రోన్​ను పోలీసులు రంగంలోకి దించుతారు. అది గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఘటనా స్థలికి చేరుకుంటుంది. సైరన్ మోగించడం వల్ల ఆకతాయిలు భయపడి పారిపోయే అవకాశముంది. అయినా వారు కదలకపోతే డ్రోన్​కు అమర్చిన కంటైనర్ ద్వారా వారిపై పొగ విడుస్తారు. వెంటనే పెప్పర్ స్ప్రేను ఆకతాయిలపై జల్లుతారు. ఈలోగా పోలీసులు అక్కడకు చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకుంటారు. దీనివల్ల పోలీసులు వచ్చేలోపు బాధితురాలికి రక్షణ దొరుకుతుంది. పోలీస్​ స్టేషన్​ చుట్టుపక్కల 20-25 కిలోమీటర్ల దూరం వరకు డ్రోన్ చేరుకునే విధంగా నమూనా రూపొందించారు.

నాలుగు నెలలుగా కృషి

ఈ నమూనా తయారు చేసిన రెడ్డి ప్రసాద్ ఇడుపులపాయలోని ట్రిపుల్​ ఐటీలో ఈసీసీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇతనికి ఇదే కళాశాలకు చెందిన ఈఈఈ మూడో సంవత్సరం విద్యార్థి బాబా, అలాగే తిరుపతి ఎస్​వీ వర్సిటీలో మూడో సంవత్సరం ఈఈఈ విద్యార్థి రెడ్డి కిషోర్ సహాయసహకారం అందించారు. నాలుగు నెలలుగా వీరు ఈ ప్రాజెక్టుపై కృషి చేస్తున్నారు.

సాయం అందిస్తే పూర్తి చేస్తాం

తాము తయారు చేసిన నమూనాను అందుబాటులోకి తీసుకురావాలంటే లక్ష రూపాయలకు పైగా ఖర్చు అవుతుందని రెడ్డి ప్రసాద్ వెల్లడించాడు. దాతలు ముందుకు వచ్చి సాయం చేస్తే దీనిని క్షేత్రస్థాయిలో ప్రయోగిస్తామని తెలిపాడు.

ఇదీ చదవండి

కువైట్ నుంచి చేరుకుంది.. గన్నవరంలో అదృశ్యమైంది!

Last Updated : Dec 20, 2020, 4:44 PM IST

ABOUT THE AUTHOR

...view details