ఆహారం కోసం వెళ్లి.. ఆపదలో పడిన ఏనుగు.. - చిత్తూరు జిల్లా తాజా వార్తలు
ఓ ఏనుగు ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్లి ఆపద కొనితెచ్చుకుంది. అడవిలో ఉండాల్సిన గజరాజు ఆహారం కోసం పంట పొలాల్లోకి వచ్చి అకస్మాత్తుగా బావిలో పడింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. నీటిలో పడిన ఏనుగును జేసీబీ ని ఉపయోగించి.. అటవిశాఖ సిబ్బంది బయటకు తీశారు.
ఓ ఏనుగు ఆహారం కోసం వెతుక్కుంటూ వెళ్లి ఆపద కొనితెచ్చుకున్న ఘటన చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి పంచాయతీ గాండ్ల పల్లె గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలోని రైతు జగ్గయ్య నాయుడు బావిలో సోమవారం రాత్రి ఏనుగు పడిపోయిందని స్థానికులు గుర్తించారు. గజరాజు ఘీంకారలు విన్న రైతులు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకి వచ్చిన అటవీశాఖ సిబ్బందిని రైతులు అడ్డుకున్నారు. నిత్యం గజరాజుల దాడులతో పంట పొలాలు నష్టపోతున్న పట్టించుకొనే దిక్కులేదంటూ ఆందోళన చేశారు. ఇక్కడ అధికారులు రైతులకు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. కాగా నీటిలో ఈదుతున్న ఏనుగును జేసీబీ సాయంతో ఏనుగును బయటకు తీశారు. బావిని తవ్వగా బయటకు వచ్చిన ఏనుగు.. పరుగు పరుగున తిరిగి అడవిలోకి వెళ్లిపోయింది. బాధిత రైతుకు జరిగిన నష్టాన్ని ఇప్పిస్తామని.. చిత్తూరు జిల్లా డీఎఫ్ఓ చైతన్య కుమార్ వెల్లడించారు. రైతులు బావుల చుట్టు పిట్టగోడలు కట్టుకుంటే.. ఇలాంటి సమస్యలను భవిష్యత్ లోను అధికమించవచ్చని ఆయన వెల్లడించారు. ఏనుగును బయటకు తీసేందుకు సహకరించిన రైతులకు చైతన్య కుమార్ ధన్యవాదాలు తెలిపారు.