కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన 32 అమృత్ నగరాల్లో చిత్తూరు ఒకటి. 2015 నుంచి 2020 వరకు అమలయ్యే అమృత్ పథకంలో నగరానికి ఐదేళ్ల కాలానికి నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ప్రధానంగా నీటి సరఫరా, ఉద్యానవనాల అభివృద్ధి, సెప్టేజ్ ప్లాంట్ల నిర్మాణానికి ఈ నిధులను ఏటా విడుదల చేస్తారు. తొలి ఏడాది 2015-16కు సంబంధించి నగరానికి రూ.3కోట్లు మంజూరయ్యాయి. ఇందులో నగరంలోని ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ల ఏర్పాటుకు రూ.2.50కోట్లు, బీవీరెడ్డి కాలనీకి ఉద్యానవన అభివృద్ధికి రూ.50లక్షలు విభజించారు. బీవీరెడ్డికాలనీ ఉద్యానవన అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. అయితే ఇంటింటికీ కుళాయి కనెక్షన్ల ఏర్పాటు పనులు మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. కుళాయి కనెక్షన్లను ఇవ్వడానికి నగరపాలక సంస్థ అధికారులు ఆన్‌లైన్‌లో ఇప్పటివరకు నాలుగు విడతలుగా టెండర్లను ఆహ్వానించారు. అయినా గుత్తేదారులు ఎవరూ టెండర్లు వేయడానికి ముందుకు రాలేదు. నగరంలో దాదాపు 4,600 నీటి కనెక్షన్లను ఉచితంగా ఇవ్వడానికి కేంద్రం నిధులు విడుదల చేసినా దురదృష్టం కొద్దీ గుత్తేదారులు ఈ పనులు చేపట్టడానికి ధైర్యం చేయలేకపోయారు.
ఈ పథకం కింద 2016-17కు సంబంధించి రూ.1.07కోట్లతో మురుకంబట్టులోని అగ్రహారం వినాయకస్వామి ఆలయం కొలనులో కొత్తగా ఉద్యానవన నిర్మాణం చేపట్టారు. ఈ నిధుల్లోనే నగరంలో మరోచోట ఉద్యానవనాన్ని నిర్మించడానికి స్థలం ఎంపిక చేశారు. అయితే అదీనూ ముందుకు సాగలేదు. ఇలా చేపట్టిన పనులన్నీ అడుగు ముందుకు పడలేదు. పైగా ఇవన్నీ ఎప్పటికి మొదలై పూర్తవుతాయనేది ప్రశ్నార్థకమే.
అడవిపల్లె ప్రాజెక్టుకు నిధుల మళ్లింపు