Amravati farmers Maha padayatra: అమరావతి ఆకాంక్షను వాయులింగేశ్వరుడి ముంగిట చాటుతూ.. రాజధాని రైతులు 39వ రోజు చిత్తూరు జిల్లాలో పాదయాత్రను కొనసాగించారు. జోరువానను సైతం లెక్కచేయకుండా లక్ష్యం దిశగా అడుగులు వేశారు. సీడీఎస్ బిపిన్ రావత్ సహా హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి చెందిన ఇతర సైనికులకు రైతులు సంతాపం తెలిపారు. చిత్తూరు జిల్లాకి చెందిన జవాన్ సాయితేజ మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంఘీభావంగా 2 నిమిషాలు మౌనం పాటించి 39వ రోజు పాదయాత్ర ప్రారంభించారు.
Maha padayatra: జైజవాన్.. జైకిసాన్ నినాదంతో మహాపాదయాత్ర - రైతుల మహాపాదయాత్ర వార్తలు
Amravati farmers Maha padayatra: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని.. 3 రాజధానులు వద్దని.. ముక్కంటి సన్నిధిలో రైతులు, మహిళలు పాదయాత్ర కొనసాగించారు.39వ రోజు ఆదిదేవుని సన్నిధిలో అమరావతి రైతులు పాదయాత్ర నిర్వహించారు. రైతుల కాళ్లు కడిగి పూలు చల్లిన స్థానికులు.. వారు చేసిన త్యాగం ముందు ఇది చాలా చిన్నదని కొనియాడారు.
వెంకటేశ్వరస్వామి రథానికి ముందు, వెనుక దాదాపు కిలోమీటరుపైగా స్థానిక ప్రజలు రాజధాని రైతులకు సంఘీభావం తెలుపుతూ...పాదం కదిపారు. శ్రీకాళహస్తీశ్వరుడిని సన్నిధానానికి చేరువకాగానే వరుణుడు సైతం చిరుజల్లులతో స్వాగతం పలికారు. శ్రీకాళహస్తి వీధుల్లో రైతులు జైఅమరావతి అంటూ వర్షంలోనూ మరింత ఉత్సాహంగా ముందుకుసాగారు. శ్రీకాళహస్తి మాడ వీధుల్లో పాదయాత్ర నిర్వహిస్తున్న రైతులకు.. పట్టణ న్యాయసముదాయం తారసపడింది. న్యాయస్థానానికి చేతులెత్తి మొక్కుతూ.. రైతులు పాదయాత్ర కొనసాగించారు. ఇదే సమయంలో కోర్టు లోపలనుంచి వచ్చిన న్యాయవాదులు జై అమరావతి అంటూ రాజధాని రైతులకు మద్దతు ప్రకటించారు. రాజధాని మహిళలు...చేతులు జోడించి తమకు న్యాయం జరిగేలా కృషి చేయాలని న్యాయవాదులను కోరారు.
అమరావతి రైతుల మహాపాదయాత్రలో పాల్గొన్న మహిళా రైతులకు...శ్రీకాళహస్తి మహిళలు పాదపూజ చేశారు. రైతుల పాదాలు కడిగి పసుపు రాసి పూలు చల్లారు. స్థానికులు తమ పట్ల చూపిన ఆదరాభిమానాలకు రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. రాజధాని కోసం చేసిన త్యాగం ముందు తాము చేసిన సేవ చాలా చిన్నదని స్థానికులు తెలిపారు. మధ్యాహ్నం వరకూ శ్రీకాళహస్తి మాడవీధుల్లో పాదయాత్రచేసిన రైతులు.. భోజనం తర్వాత విరామం ప్రకటించారు. శుక్రవారం కూడా విశ్రాంతి తీసుకోనున్న అన్నదాతలు తిరిగి 41వరోజు పాదయాత్రను ప్రారంభించనున్నారు. శుక్రవారం రోజున రాజధాని రైతులు శ్రీకాళహస్తీశ్వరుడ్ని దర్శించుకోనున్నారు.
ఇదీ చదవండి