Amararaja Batteries Company to Telangana: చూశారుగా..ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న ఓ మంత్రి, సలహాదారు వ్యాఖ్యలు. ఒక భారీ పరిశ్రమ రాష్ట్రం నుంచి వెళ్లిపోతోందంటే దాన్ని ఆపేందుకు ప్రయత్నించాల్సిన కీలక స్థానాల్లోని వ్యక్తులే ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారో.. పరిశ్రమ నిబంధల ప్రకారం నడుచుకునేలా చూడటం ప్రభుత్వ బాధ్యతే.. ఒకవేళ అలా నడుచుకోకుంటే లోపాలు సరిదిద్దుకునేందుకు అవకాశం ఇవ్వాలి కానీ..ఏకంగా బయటకు పంపేలే వేధించడం ప్రభుత్వ కక్ష సాధింపే..
వైసీపీ ప్రభుత్వ వేధింపులతో రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోయే పరంపర కొనసాగుతోంది. తాజాగా అమరరాజా బ్యాటరీస్ నూతనంగా చేపట్టనున్న విస్తరణ తెలంగాణకు తరలిపోయింది. పరిశ్రమలు పెడతామని ఎవరైనా ముందుకొస్తే ప్రభుత్వాలు వారికి ఎర్ర తివాచీలతో స్వాగతం పలుకుతాయి కానీ వైసీపీ ప్రభుత్వం తీరే వేరు..కొత్త పరిశ్రమల్ని ఆహ్వానించడం మాట అటుంచితే ఉన్నవాటినే తన్ని తరిమేస్తోంది.. ఇక గత ప్రభుత్వం హయాంలో వచ్చిన సంస్థలతోపాటు..ప్రత్యర్థి పార్టీకి చెందిన వారి సంస్థలైతే కక్షసాధింపు చర్యలు రెట్టింపవుతాయి..
కేవలం తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ సంస్థ అన్న ఏకైక కారణంతో, రాజకీయ కక్ష సాధింపుతో అమరరాజా సంస్థపై జగన్ ప్రభుత్వం తీవ్రమైన వేధింపులకు పాల్పడింది. దీంతో చిత్తూరు జిల్లాలో ఆ సంస్థ విస్తరణ పనులు విరమించుకుంది. ఒకానొక దశలో తమిళనాడుకు తరలిపోవాలనుకున్నా..అమరరాజా సంస్థ ఆలోచన గురించి తెలిసిన తెలంగాణ ప్రభుత్వం..వారికి సాదర స్వాగతం పలికింది. పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇవ్వడంతో అత్యాధునిక లిథియం అయాన్ బ్యాటరీల పరిశోధన, తయారీ యూనిట్‌ను తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో ఏర్పాటు చేసేందుకు అమరరాజా సంస్థ అంగీకరించింది. వచ్చే పదేళ్లలో 9వేల 500కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రకటించింది. దేశంలో బ్యాటరీల తయారీ రంగంలో అమరరాజా ప్రముఖ స్థానంలో ఉంది. అలాంటి సంస్థ ఏకంగా 9వేల 500కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటుకు ముందుకొస్తే..వెంటాడి వేధించి తరిమికొట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుంది.
అమరరాజా తరలిపోవడం వల్ల వారికి వచ్చే నష్టమేమీ లేదు..ఎందుకంటే వేలకోట్లు పెట్టుబడి పెట్టే పారిశ్రామికవేత్తలకు ఎక్కడైనా అదే పెట్టుబడి పెడతారు. వారికి కావాల్సిందల్లా అవసరమైన వనరులు, వసతులు, సానుకూలంగా స్పందించే ప్రభుత్వం అంతే..వారిని వెళ్లగొట్టే వరకు నిద్రపోని మంత్రులు, వైసీపీ పెద్దలకు వచ్చిన నష్టమూ ఏమీలేదు..కానీ నష్టపోయిందంతా మన రాష్ట్రమే. వెనుకబడిన రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో అమరరాజా ఫ్యాక్టరీతో ఇప్పటికే 20వేల మంది ప్రత్యక్షంగా, 50వేల మంది పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు.
ఆ సంస్థ మరో 9వేల 500కోట్ల పెట్టుబడితో లిథియం అయాన్ బ్యాటరీల తయారీ పరిశ్రమను ఇక్కడే ఏర్పాటు చేసి ఉంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా మరికొన్ని వేలమందికి ఉపాధి దొరికేది. ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీగా ఆదాయం వచ్చేది. పలు అనుబంధ పరిశ్రమలూ వచ్చేవి. పైగా రాబోయే కాలమంతా లిథియం అయాన్ బ్యాటరీలదే హవా. ఆ రంగంలో రాష్ట్రం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయేది.