నగరాల మెట్రో ప్రాజెక్టుల కోసం మెట్రోరైలు బోగీలను తయారు చేసే శ్రీసిటీలోని ఆల్‌స్టోమ్ పరిశ్రమ అరుదైన ఘనతను సొంతం చేసుకొంది. 500 మెట్రో రైలు బోగీల ఉత్పత్తిని విజయవంతంగా పూర్తి చేసింది. ఆసియా-పసిఫిక్ దేశాల్లో అతిపెద్ద మెట్రోరైలు బోగీల తయారీ కేంద్రంగా గుర్తింపు పొందిన ఆల్‌స్టోమ్ పరిశ్రమ.. ప్రపంచంలోని సిడ్నీ, మాంట్రియల్ నగరాలతోపాటు దేశంలోని చెన్నై, కొచ్చి, లఖ్‌నవూ, ముంబయి నగరాలకు తమ ఉత్పత్తులను అందజేస్తోంది. ఆల్‌స్టోమ్‌లో తయారైన మెట్రో రైలు బోగీలు ప్రపంచ వ్యాప్తంగా 2.70 లక్షల కిలోమీటర్ల మేర రైలు పట్టాలపై ప్రయాణించినట్లు ఆల్‌స్టోమ్ ఓ ప్రకటనలో తెలిపింది.
2012 సంవత్సరంలో చెన్నై మెట్రోరైలు ప్రాజెక్ట్ కోసం తమ ఉత్పత్తులను ఆల్‌స్టోమ్ సంస్థ శ్రీసిటీలో ప్రారంభించింది. ఏటా 480 మెట్రోబోగీల సామర్థ్యం కలిగిన ఆల్‌స్టోమ్ పరిశ్రమ కరోనా ప్రభావం ఉన్న రోజుల్లోనూ మెరుగైన ఉత్పత్తి సాధించింది.