LOKESH YUVAGALAM PADAYATRA : తెలుగు తమ్ముళ్లంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న.. నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న లోకేశ్.. తిరుమల శ్రీవారి ఆశీస్సులు అందుకుని.. ఒకరోజు ముందే కుప్పం చేరకున్నారు. లోకేశ్‌కు.. ఆర్ అండ్ బీ అతిథి గృహం వద్ద పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు.
మహిళా కార్యకర్తలు.. హారతులిచ్చారు. లోకేశ్ అందరినీ ఆప్యాయంగా పలకరించారు. యాత్రను పురస్కరించుకుని.. కుప్పం పట్టణం ఇప్పటికే పసుపుమయమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి.. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావడంతో.. పండగ వాతావరణం నెలకొంది. పాదయాత్ర తొలి అడుగువేసే వరదరాజస్వామి గుడి పరిసరాలన్నీ కోలాహలంగా మారాయి.
తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గం నుంచి ‘యువగళం’ పేరిట నారా లోకేశ్ 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. ఈరోజు ఉదయం సరిగ్గా 11.03 గంటలకు కుప్పం వరదరాజస్వామి ఆలయం వద్ద తొలి అడుగు వేయనున్నారు. ఈ పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగియనుంది. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కుప్పం కమతమూరు రోడ్డులో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
రాష్ట్రంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేల సంఖ్యలో తరలిరానున్నారు. సభ నిర్వహణకు వారం కిందటి నుంచే ఏర్పాట్లు మొదలుపెట్టారు. మాజీ మంత్రి అమరనాథరెడ్డి, పాలకొల్లు, రేపల్లె ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, అనగాని సత్యప్రసాద్, టీడీపీ చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు పులివర్తి నాని, కుప్పం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి పీఎస్ మునిరత్నం తదితరుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరిగాయి. పాదయాత్ర సందర్భంగా తొలి రోజు జరిగే పూజా కార్యక్రమం, బహిరంగ సభకు లోకేశ్ అత్తామామలు వసుంధర, బాలకృష్ణతోపాటు పలువురు కుటుంబ సభ్యులు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు హాజరు కానున్నారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకుని:లోకేశ్ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం తిరుపతి నుంచి ర్యాలీగా కుప్పం బయల్దేరారు. చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు, పలమనేరు నియోజకవర్గాల మీదుగా ఆయన కాన్వాయ్ సాగింది. వందల మంది కార్యకర్తలు ర్యాలీగా లోకేశ్ వెంట వచ్చారు. చెన్నై- బెంగళూరు జాతీయ రహదారి వెంట ఉన్న మండల కేంద్రాలు, పట్టణాల మీదుగా వెళ్తే టీడీపీ శ్రేణుల తాకిడి ఎక్కువగా ఉంటుందని, అందువల్ల ఆలస్యం అవుతుందని భావించిన లోకేశ్... బైపాస్ మీదుగానే వాహనశ్రేణి వెళ్లేలా చూడాలని సూచించారు.
పలమనేరు దాటాక కుప్పం- క్రిష్ణగిరి జాతీయ రహదారిలో కొందరు కార్యకర్తలు కాన్వాయ్‌ను ఆపడంతో ఆయన అభివాదం చేశారు. ఫిబ్రవరిలో మరోసారి వస్తానని మాటిచ్చారు. సాయంత్రం 5.42 గంటలకు ఆర్‌అండ్‌బీ అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ మహిళలు హారతులతో స్వాగతం పలికారు. మధ్యాహ్నం 2.30 గంటలకే కుప్పం రావాల్సి ఉండగా కార్యకర్తలు అధిక సంఖ్యలో రావడంతో సుమారు 3 గంటల జాప్యం జరిగింది.
అనంతరం పాదయాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన కమిటీలు, ముఖ్య నాయకులు, స్థానిక నేతలతో ఆయన మాట్లాడారు. భారీగా తరలివచ్చిన యువత లోకేశ్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. వారందరితో ఓపికగా మాట్లాడి.. గంటకుపైగా ఫొటోలు దిగారు. పలువురిని పేర్లతో పలకరించారు. వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడారు.
వేదికపై 300 మంది కూర్చునేలా:శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్న సభలో.. వేదికపై 300 మంది నాయకులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కుప్పం నాయకులు కలిపి మొత్తం 300 మంది వేదికపై ఉండనున్నారు. బహిరంగసభ వద్ద అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు టీడీపీ నాయకులే 400 మంది వాలంటీర్లను మోహరించారు. వీరికితోడు అదనంగా మరో 200 మంది వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉండనున్నారు. బహిరంగ సభలో నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రసంగిస్తారని టీడీపీ వర్గాల సమాచారం.