చిత్తూరు జిల్లాలో వర్షాధార పంటగా వేరుసెనగ విస్తారంగా సాగు చేస్తారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అన్నదాతకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేసింది.
సాగు లక్ష్యం 1.80 లక్షల హెక్టార్లు
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్‌లో 1.80లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణంలో పలు రకాల పంటలు సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రధానంగా వర్షాధార పంటగా పశ్చిమ మండలాల్లో వేరుసెనగ 1.13లక్షల హెక్టార్లలో సాగవుతుందని అధికారులు చెబుతున్నారు. వరి, చెరకు, మొక్కజొన్న తదితర పంటలు సాగు కానున్నాయి. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. ముందస్తుగా తొలకరి వర్షాలు కురుస్తుండడంతో అంచనాకు మించి వేరుసెనగ సాగయ్యే అవకాశాలున్నాయని వ్యవసాయ శాఖ భావిస్తోంది.
76వేల క్వింటాళ్ల వేరుసెనగ విత్తనం
ఖరీఫ్ సాగు రైతాంగానికి అవసరమైన వేరుసెనగ విత్తు పంపిణీకి అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం జిల్లాకు 76వేల క్వింటాళ్ల రాయితీ వేరుసెనగ విత్తనాన్ని కేటాయించింది. ఏపీ విత్తన సంస్థ ద్వారా విత్తనాన్ని జిల్లాలోనే సేకరించి ప్రాసెసింగ్ చేశారు. జిల్లాలోని 52 మండలాల పరిధిలో 744 ఆర్‌బీకేల్లో విత్తనాల్ని అందజేయనున్నారు. రాయితీతో 30 కిలోల బస్తాను రూ.1,562 అందజేస్తారు. ఇప్పటికే 35 వేల క్వింటాళ్ల విత్తనాన్ని ఆర్‌బీకే కేంద్రాల్లో నిల్వ చేశారు. విత్తనం కోసం రైతులు ఆర్‌బీకేల్లో పేర్లు నమోదు చేసుకున్నారు.
80,600 టన్నుల ఎరువులు..
ఖరీఫ్ సాగుకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచనున్నారు. 80,600 టన్నుల రసాయనిక ఎరువులు అవసరమవుతాయని అంచనా వేశారు. యూరియా 40 వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 11 వేలు, కాంప్లెక్స్ ఎరువులు 22 వేలు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 3,600 టన్నులు, ఎస్‌ఎస్‌పీ 4 వేల టన్నులు అవసరమని జిల్లా నుంచి ప్రతిపాదించగా.. ప్రభుత్వం ఆమోదించి కేటాయించింది. ప్రస్తుతం జిల్లాలో 32,839 టన్నుల ఎరువులు ఉన్నాయి. ఆర్‌బీకేలకు 7,453 టన్నుల ఎరువుల సరఫరాకు ప్రతిపాదనలు పంపగా.. ప్రస్తుతం 1,226 టన్నుల ఎరువులు నిల్వ ఉన్నాయి. అలాగే పచ్చిరొట్టె ఎరువు విత్తనాలు జీలుగ, జనుము, పిల్లిపెసర విత్తనాలు ఈ నెలాఖరుకు పంపిణీ చేయనున్నారు.
ఇదీచదవండి..: రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు